గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 07, 2020 , 01:37:28

తండ్రి మాటలు విని తనువు చాలించిన చిన్నారులు

తండ్రి మాటలు విని  తనువు చాలించిన చిన్నారులు

బాన్సువాడ రూరల్‌ : కందూరు కాడికి వెళ్లి తినొద్దామన్న తండ్రి మాటలను నమ్మిన ఆ చిన్నారులు కాలయముడవుతాడని అనుకోలేదు. తన ముగ్గురు కూతుళ్లను తండ్రే అతి కిరాతకంగా కొట్టి చెరువులో పడేసి తొక్కి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాడ్కోల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని డ్రైవర్స్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ ఫయాజ్‌ మద్యానికి, పేకాటకు బానిసయ్యాడు. ఆయనకు కూతుళ్లు ఆఫియా (10), మహీన్‌ (9), జోయా (7)తో పాటు కొడుకు రైస్‌ ఉన్నా రు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నలుగురు పిల్లలను తీసుకొని ఫయాజ్‌ కందూరు కాడ తి నొస్తామని చెప్పాడు. పిల్లలను తయారు చేయమని భార్య కు చెప్పగా, ఆయన మాటలు నమ్మిన భార్య కొత్తబట్టలు వేసి నలుగురిని తయారు చేసింది. ముగ్గురు కూతుళ్లతో పాటు కుమారుడు రైస్‌ను వెంటబెట్టుకొని వెళ్లాడు. చెరువు కట్ట వెంబడి కొద్ది దూరం వెళ్లాక తండ్రి నలుగురిని కొడుతుండడంతో కొడుకు రైస్‌ తప్పించుకొని తల్లి నీలోఫర్‌ వద్దకు చేరుకున్నాడు. తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె వెంటనే చెరువు కట్ట వెంబడి రోదిస్తూ వెళ్లింది. ఎదురుగా బురదమయమైన బట్టలతో భర్త ఎదురుగా వస్తుండడంతో పిల్లలు ఎక్కడని భర్తను ప్రశ్నించింది. పిల్లలు కం దూరు వద్ద ఆనందంగా తింటున్నారని, నువ్వు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెప్పాడు. భర్త మాటలను అనుమానించిన ఆమె చెరువు కట్ట వెంబడి పిల్లల కోసం వెతుక్కుంటూ వెళ్లింది. కొద్ది దూరం వెళ్లాక చెరువు కట్ట వద్ద ముగ్గురు కూతుళ్ల చెప్పులు పడి  ఉండడంతో లబోదిబోమంది. చుట్టుపక్కల ఉన్న రైతులను పిలిచింది. అక్కడికి చేరుకున్న రైతులు చెరువులో చూడగా.. ముగ్గురు కూతుళ్లు  విగత జీవులుగా కనిపించారు. 

ముగ్గురూ సరస్వతీ పుత్రికలే..

తండ్రి చేతిలో అత్యంత కిరాతంగా హత్యకు గురైన ఆఫియా, మహీన్‌, జోయా చదువుల్లో సరస్వతీ పుత్రికలే. అరాఫత్‌ కాలనీలోని ఉర్దూ మీడీయం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఆఫియా ఐదో తరగతి, మహీన్‌ నాలుగో తరగతి, జోయా ఒకటో తరగతి చదువుతున్నారు. ముగ్గురు విద్యార్థినులు తమ తరగతుల్లో మొదటి ర్యాంకులో ఉన్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కంటతడి పెట్టారు.   

మేరా అబ్బా మారా : రైస్‌ కుమారుడు

‘మేరా అబ్బా మారా’ అంటూ తండ్రి నుంచి తప్పించుకున్న కుమారుడు రైస్‌ అన్న మాటలివి. ముగ్గురు అక్కలతో పాటు తండ్రి వెంబడి రైస్‌ వెళ్లగా.. కొద్ది దూరం వెళ్లాక అక్కలను కొట్టడంతో భయాందోళనకు గురైన ఆ బాలుడు తప్పించుకొని తల్లి నిలోఫర్‌బేగం వద్దకు చేరుకున్నాడు. డీఎస్పీ వద్ద ఆ బాలుడు వచ్చీరాని మాటలతో ఇలా చెప్పాడు. 

రోదనలతో దద్దరిల్లిన ఘటనా స్థలం..

ముక్కు పచ్చలారని ముగ్గురు కూతుళ్లను కన్న తండ్రే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మండలంలో సంచలనం రేపింది. పదేండ్లలోపున్న ముగ్గురు కూతుళ్లను చెరువులో వేసి తొక్కి చంపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలు తరలి వచ్చారు. ‘నా బిడ్డలను నాకు ఇవ్వండి’ అంటూ కన్న తల్లి రోదనలు కంటతడి తెప్పించాయి. కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ అక్కడికి వచ్చిన యువకులు, మహిళలు డిమాండ్‌ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ దామోదర్‌రెడ్డి బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. ముగ్గురు కూతుళ్లను కిరాతంగా చంపడం అత్యంత బాధాకరమని, బాలికలను హత్య చేసిన తండ్రి ఫయాజ్‌ను బురద బట్టలతో తాడ్కోల్‌ గ్రామంలోని కల్లు కంపౌండ్‌లో పట్టుకున్నట్లు  సీఐ మహేశ్‌గౌడ్‌ తెలిపారు. విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

తల్లి టైలరింగ్‌తోనే కుటుంబ పోషణ..

నిజామాబాద్‌కు చెందిన సయ్యద్‌ ఫయాజ్‌తో బాన్సువాడ పట్టణానికి చెందిన నీలోఫర్‌కు 2009లో వివాహమైంది. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతుండడంతో నీలోఫర్‌ తండ్రి తన కూతురు కాపురం చక్కదిద్దేందుకు సొంత డబ్బులతో తాడ్కోల్‌ పరిధిలోని డ్రైవర్స్‌ కాలనీలో ఇల్లు కట్టించి ఇచ్చాడు. వీరికి నలుగు సంతానం కాగా, అందులో ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. నలుగురు పిల్లలు పుట్టినా ఫయాజ్‌ పనులు చేయకుండా జులాయిగా తిరుగుతూ భార్యను నిత్యం వేధిస్తుండేవాడు. ఇంట్లో వస్తువులను అమ్ముకుంటూ మద్య సేవించేవాడు. తాగిన మైకంలో భార్యతో పాటు నలుగురు పిల్లలను కిరాతంగా కొడుతుండేవాడు. భార్య నీలోఫర్‌ బేగం టైలరింగ్‌ చేసుకుంటూ ముగ్గురు కూతుళ్ళైన ఆఫియా, మహీన్‌, జోయాతో పాటు కుమారుడు రైస్‌ను పోషించుకుంటూ కాలం వెళ్లదీసేది. రోజూ తాగుతూ ఇంటికి వచ్చి చిత్రహింసలకు గురి చేస్తుండే వాడని, ఇంట్లోని వస్తువులు అమ్ముకుంటూ తాగుతుండే వాడని, గురువారం రాత్రి డబ్బులు ఇవ్వాలని తనతో పాటు పిల్లలకు కిరాతంగా కొట్టినట్లు భార్య నీలోఫర్‌ డీఎస్పీకి వివరించింది.


logo
>>>>>>