సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 04, 2020 , 23:45:54

ఏసీబీ వలలో లింగంపేట ఆర్‌ఐ

 ఏసీబీ వలలో లింగంపేట ఆర్‌ఐ

లింగంపేట : పట్టా మార్పిడి కోసం లంచం తీసుకుంటూ లింగంపేట ఆర్‌ఐ సుభాష్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ సీఐ రవికుమార్‌ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. లింగంపేట మండలం కోర్పోల్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ నూరుద్దీన్‌ సోదరులు నాగారం గ్రామ శివారులో 1972 సంవత్సరంలో 17.32 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. నాటి నుంచి ముగ్గురు సోదరులు కబ్జాలో ఉన్నారు. 2016 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో నూరుద్దీన్‌కు సంబంధించి 128 సర్వే నంబరులో ఉన్న ఎకరం 10 గుంటల భూమిని లింగంపేటకు చెందిన సంతోష్‌ రెడ్డి పేరిట పట్టా మార్పిడి చేసి పట్టదారు పాసుపుస్తకం జారీ చేశారు. సంతోష్‌రెడ్డి భూమి హద్దులు చూపాలని రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు భూమి సర్వే చేయడానికి వెళ్లారు. భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో సంతోష్‌ రెడ్డి ఎకరం పది గుంటల భూమి నుంచి ఐలాపూర్‌ గ్రామానికి చెందిన ఎకరం భూమిని బెజుగం దేవేందర్‌కు విక్రయించాడు. 


తన భూమిని ఇతరులకు పట్టా చేయడంతో నూరుద్దీన్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో కార్యాలయంలో అప్పీల్‌ చేసుకోవాలని సూచించారు. కోర్టులో కాలయాపన అవుతుందని భావించిన నూరుద్దీన్‌ సంతోష్‌రెడ్డి, బెజుగం దేవేందర్‌లకు లక్షా 50 వేల రూపాయలు చెల్లించి తిరిగి భూమిని తన పేరుపైన రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. తాము రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూమికి పట్టా మార్పిడి చేయాలని కోరగా ఆర్‌ఐ డబ్బులు డిమాండ్‌ చేశాడు. దీంతో ఈ నెల 2వ తేదీన రూ.1500 అందజేశాడు. మిగిలిన మూడు వేల రూపాయలతోపాటు సెల్‌ఫోన్‌ కావాలని తిరిగి అడగడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు ఏసీబీ సీఐ తెలిపారు. బుధవారం సాయంత్రం తహసీల్‌ కార్యాలయం ఆవరణలో నూరుద్దీన్‌ సోదరుని కుమారుడు మహ్మద్‌ బషీరుద్దీన్‌ అలియాస్‌ సలీం నుంచి ఆర్‌ఐ సుభాష్‌ మూడు వేల రూపాయలతోపాటు సెల్‌ఫోన్‌ తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఆర్‌ఐ సుభాష్‌ నుంచి మూడు వేల రూపాయలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్‌ఐ సుభాష్‌ను ఆరెస్టు చేసినట్లు ఏసీబీ సీఐ రవికుమార్‌ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పనులు చేయడానికి డబ్బులు డిమాండ్‌ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని సూచించారు.


logo