బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 03, 2020 , 23:57:29

అద్దె బస్సులు వచ్చేదెప్పుడో!

అద్దె బస్సులు వచ్చేదెప్పుడో!
  • చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు...
  • జిల్లాలో 2 డిపోల్లో 52 కొత్త బస్సులకు టెండర్‌...
  • డిపోలకు చేరినవి కేవలం 14 మాత్రమే...
  • గడువు ముగిసినా ఇంకా చేరని 38 బస్సులు...
  • అద్దె బస్సు నిర్వాహకులపై జరిమానాలు పడేనా?

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతేడాది అక్టోబర్‌లో అద్దె బస్సుల కోసం టెండర్లకు ఆహ్వానించింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఫిబ్రవరి 26 తేదీ నాటికి టెండర్లలో రూట్లు దక్కించుకున్న వారంతా బస్సులను డిపోలకు అందించాలి. తదనుగుణంగా ఆర్టీసీ ద్వారా నెలవారీగా కిరాయిని యజమానులకు చెల్లిస్తారు. కామారెడ్డి జిల్లాలో రెండు ఆర్టీసీ డిపోలున్నాయి. కామారెడ్డి, బాన్సువాడలో మొత్తం 52 కొత్త బస్సులకు ఆర్టీసీ టెండర్లు పిలువగా భారీగానే స్పందన వచ్చింది. ఇందులో సగానికి ఎక్కువ మంది ఇంత వరకు బస్సులను తిప్పకపోగా టెండర్‌ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రజా అవసరాల నిమిత్తం పలు రూట్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సేవలు అందించాలని  ఆర్టీసీ భావించగా అద్దె బస్సుల నిర్వాహకులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం విడ్డూరంగా మారింది. గడువు మీరినప్పటికీ ఇంత వరకు బస్సులను డిపోలకు చేర్చకపోవడంతో ఆర్టీసీ అధికారులు సైతం చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

-కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  ప్రజా రవాణాను మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇటు ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అద్దె బస్సుల నిర్వహణకు ఆర్టీసీకి అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతితో గతేడాది అక్టోబర్‌లో ఆర్టీసీ యాజమాన్యం పలు రూట్లలో బస్సులు తిప్పేందుకు టెండర్లు పిలిచారు. ఇందులో పో టాపోటీగా టెండర్లు వేసినటువంటి అద్దె బస్సు నిర్వాహకులు తీరా సమయానికి వాహనాలను అందించడానికి తాత్సారం చేస్తున్నారు. నిబంధనల మేరకు మూడు నెలల కాలంలో టెండర్‌లో దక్కించుకున్న రూట్‌లో సేవలు కొనసాగించేందుకు ఆర్టీసీకి బస్సులు అందించాల్సి ఉంది. కానీ ఇంత వరకు కామారెడ్డి జిల్లాలో ఆ పరిస్థితే లేకుండా పోయింది. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఆర్టీసీకి అంతో ఇంతో లాభాలు వచ్చే సమయమిది. అయినప్పటికీ బస్సులు రాకపోవడం విడ్డూరంగా మారింది. టెండర్‌ ప్రకారం బస్సులను తెప్పించాల్సిన బాధ్యత సంబంధిత డిపోలకు చెందిన అధికారులపై ఉన్నప్పటికీ వారంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అద్దె బస్సు నిర్వాహకులదీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా మారింది.


52 బస్సులకు వచ్చినవి 14 బస్సులే...

కామారెడ్డి, బాన్సువాడలో రెండు డిపోల్లో మొత్తం 52 ప్రైవేటు బస్సులకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో కామారెడ్డి డిపో పరిధిలో 24 బస్సులు, బాన్సువాడ డిపో పరిధిలో 28 బస్సులున్నాయి. ఇంత వరకు కామారెడ్డిలో 9 బస్సులు మాత్రమే రిపోర్ట్‌ చేశాయి. ఇంకా 15 అద్దె బస్సులు రిపోర్టు చేయాల్సి ఉంది. అలాగే బాన్సువాడ డిపోలో కేవలం 5 బస్సులే రిపోర్ట్‌ చేయగా 23 బస్సులు ఇప్పటికీ రాలేదు. గత నెల 26వ తేదీకి గడువు ముగిసినప్పటికీ అద్దె బస్సు నిర్వాహకులు మాత్రం టెండర్‌ ఒప్పందం మేరకు బస్సులు తీసుకరాకపోవడం గమనార్హం. 90 రోజుల కాల వ్యవధిని ఆర్టీసీ యాజమాన్యం కల్పించినప్పటికీ తాత్సారం చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టెండర్‌లో పాల్గొన్న వారంతా సామర్థ్యానికి మించి బస్సులను దక్కించుకున్నారు. దీంతో కొత్తగా బస్సుల కొనుగోలు వ్యవహరం వారికి తల ప్రాణం తోకకు వచ్చినట్లుగా మారింది. బ్యాంకుల నుంచి కొంత మంది రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగించి చతికిల పడ్డారు. బస్సులను త్వరగా డిపోలకు చేర్చేలా కృషి చేసి, వాటి సామర్థ్యాన్ని పరీక్షించి రోడ్లపై చక్కర్లు కొట్టించాల్సిన ఆర్టీసీ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


జరిమానాలు పడేనా?

అక్టోబర్‌లో జరిగిన టెండర్‌ ప్రక్రియలో అద్దె బస్సులు తిప్పేందుకు టెండర్లో పాల్గొన్న వారంతా ఆర్టీసీ నియమ, నిబంధనలకు లోబడాల్సింది ఉంది. 90 రోజుల్లోపు అద్దె బస్సులను సంస్థకు అందివ్వని పక్షంలో వారిపై ప్రతి రోజూ రూ.1000 చొప్పున జరిమానా విధించాల్సి ఉంది. ఇంత వరకు టెండర్లలో బస్సులు నడిపేందుకు అనుమతులు పొందిన వారెవ్వరికీ కనీసం నోటీసులు కూడా పంపకపోవడం విశేషం. అద్దె బస్సు ఓనర్లతో ఆర్టీసీ అధికారులకు మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలే ఇందుకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. బస్సులను డిపోలకు చేర్చని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా? జరిమానాలు విధించి రూట్లలో కొత్త బస్సులను త్వరగా పంపుతారా? అన్నది డిపో బాధ్యులపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే జిల్లాలో తిప్పుతోన్న అద్దె బస్సులన్నింట్లోనూ నిర్వహణ లోపం స్పష్టం కనిపిస్తోంది. ఏనాడు ఒక్క అద్దె బస్సు కూడా పరిశుభ్రంగా ఉన్న దాఖలాలే లేవు. వాటి నిర్వహణను నిత్యం పరిశీలించాల్సిన వారు మిన్నకుండిపోతుండటంతో దుమ్ము, దూళిలోనే ప్రయాణికులు తమ గమ్యానికి చేరుకోవాల్సి వస్తున్నది.


కొద్ది రోజుల్లోనే కొత్త బస్సులు వస్తాయి...

డిపో పరిధిలో అద్దె బస్సులను నడిపేందుకు టెండర్లు దక్కించుకున్న వారిలో కొద్ది మాత్రమే బస్సులను డిపోలకు చేర్చారు. వాటికి ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసి ప్రజా రవాణాకు వినియోగిస్తాం. ఇప్పటికే పలు బస్సులను తిప్పుతున్నాం. చాలా మంది గడువులోపు బస్సులను అప్పగించలేదు. వారికి నిబంధనల మేరకు రోజువారీగా జరిమానాలు విధిస్తాం. ఇంకా తాత్సారం చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాలతో తగు చర్యలు తీసుకుంటాం.

- ఆంజనేయులు, కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌logo