బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 03, 2020 , 23:56:04

ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వీడాలి..

ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వీడాలి..
  • పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి
  • పదిలో వందశాతం ఉత్తర్ణత సాధించే వారికి సన్మానం
  • ఫలితాల్లో తేడా వస్తే ఇంక్రిమెంట్లలో కోత
  • ఎల్లారెడ్డి, కామారెడ్డిలో ఉపాధ్యాయులతో కలెక్టర్‌ శరత్‌ సమీక్ష

ఎల్లారెడ్డి రూరల్‌ : పదో తరగతి పరీక్షలకు చాలా తక్కువ సమయం ఉందని, ఉపాధ్యాయులు అలసత్వం, నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, జిల్లా కేంద్రంలోని ఈఎస్‌ఆర్‌ గార్డెన్‌లో వేర్వేరుగా ఉపాధ్యాయులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎంఈవో, డీఈవో, కలెక్టర్‌ ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావని, ఉపాధ్యాయులు సంకల్పిస్తే కచ్చితంగా అనుకున్న ఫలితాలు వస్తాయని అన్నారు. ఒక్క ఉపాధ్యాయుడి నిర్లక్ష్య ధోరణితో మిగతా ఐదు సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదని తెలిపారు. తమ పిల్లల్లాగే విద్యార్థులను చూడాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం విద్యార్థులకు వేకప్‌ కాల్స్‌ చేయాలన్నారు. వారు ఏం చదువుతున్నారో చూడాలన్నారు. ఏవైనా వారికి రాని అంశాలుంటే వాటిని పదే పదే రిపీట్‌ చేయించి వారి సమస్యలను తీర్చాలన్నారు. ఇలా చేస్తే కచ్చితంగా వందశాతం ఫలితాలు వస్తాయని తెలిపారు. జిల్లాలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నా పూర్తిస్థాయి ఫలితాలు ఎందుకు సాధించకూడదని ప్రశ్నించారు. 


డల్‌, యావరేజ్‌ విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సాయంత్రం ఇండ్ల వద్ద విద్యార్థులు స్ట్రీట్‌వైజ్‌గా, కాలనీవైస్‌గా గ్రూపులుగా ఏర్పడి చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానిస్తామని, ఉత్తీర్ణత తక్కువ వచ్చిన పాఠశాలల ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్లలో కోత విధిస్తామని హెచ్చరించారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో దేవేందర్‌ రెడ్డి, డీఈవో రాజు, పరీక్షల సహాయ సంచాలకులు నీలం లింగం, మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, ఎంఈవో వెంకటేశం,  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ గుమిడెల్లి మహేందర్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, గాంధారి మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం, ఎంఈవో ఎల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo
>>>>>>