మంగళవారం 07 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 01, 2020 , 01:13:43

దేశాయిపేట టు డీసీసీబీ!

 దేశాయిపేట టు డీసీసీబీ!

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి అపార అనుభవాన్ని, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సలహాలు, సూచనలతో డీసీసీబీకి మంచి గుర్తింపు తెచ్చేలా బాధ్యతలు నిర్వహిస్తానని కొత్త చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. డీసీసీబీ చైర్మన్‌గా అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డీసీసీబీ చైర్మన్‌గా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఉభయ జిల్లాల ఎమ్మెల్యేలు, డైరెక్టర్లకు, సొసైటీ చైర్మన్లకు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీదున్న నమ్మకంతో పెద్ద బాధ్యత అప్పగించారని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మంచి పేరు తీసుకువస్తానని అన్నారు.   జిల్లాకు అవసరమైన దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాల కోసం టెస్కాబ్‌ ద్వారా రైతులందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. రుణాల మంజూరులో రైతులందరికీ మేలు జరిగేలా చొరవ చూపుతానని తెలిపారు. బ్యాంకులను మరింత పటిష్ట పర్చే చర్యలు తీసుకుంటానన్నారు. సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేలా ప్రణాళికాబద్ధ్దంగా అందరితో కలిసి అందరి సలహాలు , సూచనలు తీసుకుని ముందుకు సాగుతానన్నారు. 


logo