గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 29, 2020 , 00:03:20

ప్రగతి జోరు..

ప్రగతి జోరు..

విద్యానగర్‌ : పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఐదో రోజైన శుక్రవారం వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగాయి. కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ జిల్లా కేంద్రంలోని 9,10,11,15,16,17 వార్డుల్లో పర్యటించారు. ఆయా కాలనీల ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు డ్రైనేజీ సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. చెత్తను రోడ్లపై వేయవద్దని కాలనీ వాసులకు సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్త బుట్టల్లో వేయాలన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలను నాటాలని అన్నారు. వార్డుల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలు ఉండడంతో శుభ్రం చేయాలని ఆదేశించారు. లింగాపూర్‌లో పూడిక నిండిన మురుగు కాలువలను పరిశీలించారు. పూడిక మట్టిని నాలుగు రోజుల్లో పూర్తిగా తీయించాలని కౌన్సిలరులకు సూచించారు. చెరువు కట్టపై ఇరువైపులా మొక్కలు నాటాలని అన్నారు. మురుగు కాలువలు తీసే కూలీలకు రూ. 600 చెల్లించాలని, పిచ్చిమొక్కలు తొలగించే కూలీలకు రూ. 450 చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, కౌన్సిలర్లు మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ అమీన్‌సింగ్‌, కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>