శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 28, 2020 , 00:20:55

రేపే చైర్మన్ల ఎన్నిక

రేపే చైర్మన్ల ఎన్నిక

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: డీసీసీబీ, డీసీఎంఎస్‌   చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ఈనెల 29న శనివారం  జరగనున్నది. ఈ మేరకు జిల్లా సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ డీసీసీబీలోని నూతన భవనంలో పూర్తిచేస్తారు. డీసీఎంఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 8.30 గంటల నుంచి 9 వరకు అధికారులు డైరెక్టర్లతో సమావేశాన్ని నిర్వహిస్తారు. అంతకు ముందు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డైరెక్టర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సీల్డ్‌ కవర్‌లో అధిష్ఠానం పంపిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఆ మేరకు అధిష్ఠానం సూచించిన అభ్యర్థులకు మద్దతు తెలుపాల్సిందిగా వివరించి, ఈ ఎన్నిక ప్రక్రియకు పంపుతారు. అధికారులు తొలుత డైరెక్టర్లతో మీటింగ్‌ ఏర్పాటు చేసుకొని కోరం ఉందో లేదో చూసుకుంటారు. 50శాతం కన్నా ఎక్కువ మంది హాజరైతే కోరం ఉన్నట్లుగా నిర్ధారించి ఎన్నిక ప్రక్రియకు వెళ్తారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 12గంటలలోపు స్క్రూటీని పూర్తిచేసి జాబితాను ప్రచురిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఆ తర్వాత బరిలో ఉన్న వారికి ఎన్నిక నిర్వహిస్తారు. ఒకే నామినేషన్‌ దాఖలైతే దానిని ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలు ఇప్పటికే ఏక్రగీవమయ్యాయి. 

ఈ నేపథ్యంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పీఠాలు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమన్వయం చేస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పీఠాలు ఆశిస్తున్న అభ్యర్థుల పేర్లను అధిష్ఠానానికి చేరవేశారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ కానున్నది. సీల్డ్‌ కవరలో అధిష్టానం డిక్లేర్‌ చేసిన పేర్లను మంత్రి 29న జరిగే సమావేశంలో ప్రకటిస్తారు. ఆ మేరకు డైరెక్టర్లు అంతా మద్దతు తెలిపేలా సమన్వయం చేస్తారు. అధిష్టానం ఖరారు చేసిన వారే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేయనుండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. అయితే ఎవరి పేరును అధిష్టానం సూచిస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎవరికివారే అధిష్టానం వద్ద ప్రయత్నం చేస్తున్నా.. సీఎం కేసీఆర్‌ మదిలో ఉన్న ఆలోచనలు అంతుచిక్కడం లేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. 29న ఉదయం ఎన్నిక ప్రక్రియకు ముందు జరిగే సమావేశంలో సీల్ట్‌ కవర్‌ తెరిస్తే గాని చైర్మన్‌ పీఠాలు ఎవరికి వరిస్తాయో అనే విషయంలో స్పష్టత రానున్నది. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనున్నది.  logo