సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 25, 2020 , 01:50:03

పర్యటిస్తూ.. సమస్యలు గుర్తిస్తూ

పర్యటిస్తూ.. సమస్యలు గుర్తిస్తూ

బాన్సువాడ రూరల్‌ : పట్టణాభివృద్ధి, పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని, ప్రజల  భాగస్వామ్యంతో పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిదుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు నడుం బిగించాలని కలెక్టర్‌ శరత్‌ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ప్రారంభోత్సవంలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ నందలాల్‌ పవార్‌, ఆర్డీవో రాజేశ్వర్‌తో కలిసి పర్యటించారు. వార్డులోని మురికి కాలువలు, విద్యుత్‌ స్తంభాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రశాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో బాన్సువాడ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, పట్టణంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై  ఉందన్నారు. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, వార్డు ప్రత్యేకాధికారి రాములు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, కౌన్సిలర్‌ సరిత, నాయకులు నార్ల సురేశ్‌గుప్తా, మహ్మద్‌ ఎజాస్‌, గురువినయ్‌ కుమార్‌, నార్ల ఉదయ్‌, స్పీకర్‌ అదనపు కార్యదర్శి భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు. 


పట్టణాలకు పట్టిన మురికిని తొలగిద్దాం

ఎల్లారెడ్డి రూరల్‌ : పట్టణాలకు పట్టిన మురికిని తొలగిద్దామని కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చ కాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. మొదటగా పట్టణంలోని మురికి కాలువలను శుభ్రం చేయాలన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలన్నారు. ఒకొక్క వార్డులో 60 మందితో కలిసి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో కావాల్సిన వసతులను ప్రజాప్రతినిధులు గుర్తించి అధికారులకు తెలియజేయాలన్నారు.  


టాయిలెట్లు నిర్మించాలి..

మున్సిపాలిటీకి వివిధ పనులపై ఇతర గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారని, పట్టణ పరిస్థితిని బట్టి ఎన్ని టాయిలెట్లు, ఎక్కడెక్కడ నిర్మించాలో గుర్తించాలన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మూడు నెలల్లోగా నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. నిరక్ష్యరాస్యులకు గుర్తించి వారికి చదువు నేర్పించాలన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, తహసీల్దార్‌ స్వామి,  వార్డు స్పెషలాఫీసర్‌ వెంకటేశం, వార్డు కౌన్సిలర్‌ అల్లం శ్రీను, విద్యుత్‌శాఖ డీఈఈ భద్రయ్య, మున్సిపల్‌ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో పర్యటన..

విద్యానగర్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా కలెక్టర్‌ శరత్‌ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సోమవారం పర్యటించారు. పల్లెప్రగతి కార్యక్రమ ఉద్దేశాన్ని పలు వార్డుల ప్రజలకు వివరించారు. కామారెడ్డి పట్టణంలోని 21వ వార్డులోని బీడీ వర్కర్స్‌ కాలనీలో, 41వ వార్డులలోని పంచముఖి హనుమాన్‌ ఆలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వార్డుల్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పది రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని వార్డుల్లో పారిశుద్ధ నిర్వహణ, పచ్చదనం పెంపు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌ స్తంభాలకు మరమ్మతులు, ఇండ్లపై ఉన్న విద్యుత్‌ తీగలను తొలగించడం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అధికారులకు సూచించారు. రోడ్లపై చెత్త వేయవద్దని, తడి, పొడి చెత్తను చెత్తబుట్టల్లో వేర్వేరుగా వేయాలన్నారు. 


విద్యుత్‌ బిల్లులు, ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని కోరారు. ఇంటింటికీ కృష్ణ తులసి మొక్కలను అందించాలని ఫారెస్టు అధికారులకు సూచించారు. మిగతా వార్డుల్లో ఇన్‌చార్జులు, అధికారులు, కౌన్సిలర్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని వార్డు సమస్యలపై చర్చించారు. అనంతరం సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, టీపీవో శైలజ, డీఎఫ్‌వో వసంత, వార్డు కౌన్సిలర్లు లావణ్య ప్రసాద్‌, రాజమణి గణేశ్‌, మున్సిపల్‌, విద్యుత్‌, ఫారెస్టు శాఖ అధికారులు పాల్గొన్నారు.


logo