గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 25, 2020 , 01:42:12

పాఠశాలలకు తనిఖీ బృందాలు

పాఠశాలలకు తనిఖీ బృందాలు

నిజాంసాగర్‌ రూరల్‌ : విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో నిరంతర సమగ్ర మూ ల్యాంకనం(సీసీఈ) విధానాన్ని అమలు చేస్తున్నది. విద్యార్థులు తరగతి గదిలో అవగాహన చేసుకొన్న పాఠ్యాంశాలను పరీక్షల్లో సొంత ఆలోచనలతో వ్యక్తీకరించడం దీని ఉద్దేశం. సీసీఈ విధానం అమలు తీరును తెలుసుకునేందుకు నాలుగేండ్లుగా పాఠశాలల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పాఠశాల ల్లో అమలు చేస్తున్నీ సీసీఈ విధానాన్ని క్షేత్రస్థాయి లో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు మంగళవారం నుంచి పరిశీలించనున్నాయి. ఇందుకోసం సోమవారం జిల్లా కేంద్రంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని  కూడా నిర్వహించారు. 


జిల్లాలో పరిస్థితి ఇదీ

జిల్లాలో మొత్తం 187  ఉన్నత పాఠశాలలు, 19 కస్తూర్బా పాఠశాలలు, 6 ఆదర్శ పాఠశాలలలు ఉన్నాయి. విద్యార్థుల్లో సొంత ఆలోచన, సృజనాత్మకత, పరిశోధన ఉండడం లేదని భావించి నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానాన్ని అమలు చేశారు. మూల్యాంకనంలో భాగంగా యూనిట్‌ పరీక్షలకు బదులుగా నాలుగు నిర్మాణాత్మక(ఎఫ్‌ఏ), రెండు సంగ్రహణాత్మక(ఎస్‌ఏ1,ఎస్‌ఏ2) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్‌ఏ పరీక్షల్లో ప్రాజెక్టు, ప్రయోగాలు, నోట్సు రాయడం తదితర అంశాలకు 20 మార్కులకు నిర్వహిస్తుండగా నాలుగు ఎఫ్‌ఏలకు వచ్చిన 20 మార్కుల నుంచి 20 మార్కులను కేటాయిస్తున్నారు. 


తనిఖీ బృందాలు ఇలా: పదో తరగతి పరీక్షల్లో సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నా కొన్ని చోట్ల నిర్మాణాత్మక పరీక్షలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్మాణాత్మక పరీక్షల్లో నిక్కచ్చిగా ఉండడం లేదని ఎక్కువ గ్రేడింగ్‌ సాధించాలనే ఉద్దేశంతో అంతర్గత మార్కుల నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నా యి. దీంతో అంతర్గత మార్కులను పరిశీలించేందుకు మానిటరింగ్‌ బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానం, నిర్మాణాత్మక పరీక్షల నిర్వహణ తీరు, పరీక్షల అమలు విద్యార్థులకు ఇస్తున్న మార్కులను పరిశీలించనున్నారు. జిల్లాలో మొత్తం 25 బృందాలు ఈనెల 25 నుంచి 28 వరకు తనిఖీలు చేపట్టనున్నాయి. విద్యార్థులకు కేటాయించిన మార్కుల ఆధారంగా వారి నుంచి ప్రతిస్పందనలు, పుస్తక సమీక్ష, అభిప్రాయ సేకరణ, ప్రాజెక్టు వర్క్‌లను పరిశీలిస్తారు. విద్యార్థులకు ఇష్టానుసారం వేసిన మార్కులను తనిఖీ బృందాలు నిబంధనలకు అనుగుణంగా తగ్గించనున్నారు. తనిఖీ బృందంలో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఒకరు భాషా పండితులు, ఇతర విషయ పరిధిల నుంచి ఒకరు ఇలా మొత్తం ముగ్గురు సభ్యులతో బృందం ఉంటుంది. 


logo