శనివారం 28 మార్చి 2020
Kamareddy - Feb 25, 2020 , 01:26:23

‘ఉమ్మడి’ నిర్ణయం!

‘ఉమ్మడి’ నిర్ణయం!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో 144 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లలో అధిక శాతం మంది డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులపై కన్నేశారు. తొలుత పాలకవర్గ సభ్యులుగా ఎన్నికై ఆ తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆశావహులు పోటీ పడుతున్నా రు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన అధ్యక్షులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. డీసీసీబీతో పాటు డీసీఎంఎస్‌ కూడా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి డీసీసీబీపైనే ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) ఎన్నికలకు 22వ తేదీనా డు నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ఆశావహుల్లో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. మంగళవారం(నేడు) డీసీసీబీలో 20 డైరెక్టర్‌ పదవులకు, డీసీఎంఎస్‌లో 14 డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 28న ఎన్నికలను ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.


ఆశావహులు భారీగా ఉన్నప్పటికీ ఆయా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనే అసంతృప్తులను బుజ్జగించి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాన్ని బలపరిచే విధంగా వారిని దారిలోకి తీసు కువస్తున్నారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షతన ఆది, సోమ వారాల్లో వరుసగా ఉ మ్మడి జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్పీకర్‌తో పోచారం శ్రీనివాస రెడ్డితో సహా ఎమ్మెల్యేలు గంప గోవర్దన్‌, హన్మంత్‌ షిండే, సురేందర్‌, షకీల్‌ అహ్మద్‌, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌లు పాల్గొన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్ల ఖరారు మాత్రం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఎమ్మెల్యేలంతా భావిస్తున్నారు.


ఏకగ్రీవం దిశగా ఎన్నికలు...

కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులే ఎక్కువ సహకార సంఘాలు కైవసం చేసుకున్నారు. ఈసారి పోటీ జరిగే అవకాశాలు లేకపోవడంతో ఏకగ్రీవంగానే డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులకు ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం సంఘాల అధ్యక్షులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. 

ఇతర పార్టీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ స్థానాలను గెలవకలేక పోవడంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులు దాదాపుగా టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరే అవకాశాలే మెండుగా ఉన్నాయి. నాయకుల మధ్య సఖ్యత కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయ్యారు. నేడు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు రోజు కావడం, పరిశీలన, ఉపసంహరణకు కూడా చివరి రోజు కావడంతో ఒక్కో డైరెక్టర్‌ పదవికి ఒక్కరే నామినేషన్‌ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రెండు పాలకవర్గాల్లో డైరెక్టర్లు ఉండేలా ఆలోచన చేస్తున్నారు. దీనిలో కూడా సామాజిక వర్గాల సమతుల్యతను పాటించి అందరినీ సంతృప్తి పరిచేందుకు బుజ్జగింపులు ప్రారంభించారు. పార్టీకి సంబంధించిన అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. నామినేషన్ల రోజునే డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైతే 28న ఎన్నికలు జరుగకపోవచ్చు. 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. పదవులు తక్కువగా ఉన్నాయి. పోటీపడే వారు మాత్రం పెరిగిపోతుండడంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు డైరెక్టర్‌ పదవులను కట్టబెట్టడం కత్తిమీది సాములా మారింది. ఇలాంటి పరిస్థితిలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం ఇప్పుడు జిల్లా నేతలకు సవాల్‌గా మారింది.


ఏకపక్షంగానే ఎన్నిక...

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పరిధి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కొనసాగనుండడంతో రెండు జిల్లాలో 144 ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలున్నాయి. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 55 సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్ధతుదారులే అత్యధిక స్థానా ల్లో విజయం సాధించారు. 144 పీఏసీఎస్‌లకు 133 మంది పీఏసీఎస్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ వారే గెలిచారు. కాంగ్రెస్‌కు 6, ఇతరులు 5 చోట్ల మాత్రమే పీఏసీఎస్‌ పీఠాలను దక్కించుకున్నారు. డీసీసీబీలో 20 మంది డైరెక్టర్‌ స్థానాలుండగా పీఏసీఎస్‌ల ద్వారా 16 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. మిగిలిన 4 డైరెక్టర్ల ఎన్నికను బీ-కేటగిరిలోని సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లోని 10 మంది డైరెక్టర్‌ స్థానాల్లో ఏ-కేటగిరిలోని 6 డైరెక్టర్‌ పోస్టులను పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. మిగిలిన 4 డైరెక్టర్‌ పదవులను బీ-కేటగిరిలోని సంఘాల అధ్యక్షులు ఎన్నుకుంటారు. పీఏసీఎస్‌ చైర్మన్లుగా ఎన్నికైన వారు, వ్యవసాయేతర సంఘాల నుంచి ఎన్నికైన చైర్మన్లు ఎవరైనా డైరెక్టర్‌ పదవులకు పోటీ చేయాలనుకుంటే ఒకే నామినేషన్‌ వేయాల్సి ఉంటుంది. డీసీసీబీ లేదంటే డీసీఎంఎస్‌లో ఏదో ఒక దానికి మాత్రమే పోటీ చేయాలి. రెండు పదవులకు నామినేషన్‌ వేస్తే అది చెల్లబాటు కాదు. ఎస్సీ, ఎస్టీలకు నామినేషన్‌ రుసుము రూ.1000, బీసీలకు రూ.2వేలు, ఓసీలకు రూ.4వేలుగా నిర్ణయించారు.


logo