శనివారం 28 మార్చి 2020
Kamareddy - Feb 24, 2020 , 01:29:55

క్రీడలకు ప్రాముఖ్యతనిస్తున్నాం

క్రీడలకు ప్రాముఖ్యతనిస్తున్నాం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాముఖ్యతనిస్తున్నదనీ, దీని ఫలితంగా మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న 5వ జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ చీఫ్‌ మినిస్టర్‌ కప్‌-2020 పోటీలు ఆదివారం ముగియగా, ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌-14 విభాగంలో విజేతగా నిలిచిన జిల్లాకు చెందిన క్రీడాకారిణి పావనికి రూ.20 వేలు, రుత్విక్‌కు రూ.15 వేల చెక్కు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం క్రీడా పతకాల సాధనలో దేశంలోని పలు రాష్ర్టాలతో పోటీపడుతున్నదనీ, రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు షటిల్‌, రెజ్లింగ్‌, అథ్లెటిక్స్‌, కరాటే, కబడ్డీ పోటీల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా క్రీడారంగంలో అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఆనందంగా ఉందనీ, క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పోటీల నిర్వాఁకులు చల్ల హరిశంకర్‌, ఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించామనీ, 20 రాష్ర్టాల నుంచి సుమారు 1400 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు.


కరాటే ఫెడరేషన్‌ అనుమతిస్తే వచ్చే సంవత్సరం కాంటినెంటల్‌ షోటోకాన్‌ కరాటే డో ఇండియా (సీఎస్‌కేఐ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తామన్నారు. జాతీయ కరాటే అకాడమీకి కరీంనగర్‌లో స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, కాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, కాయ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరు రాజిరెడ్డి, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్‌, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం కార్యవర్గ సభ్యుడు గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కరాటే ఫెడరేషన్‌ ట్రెజరర్‌ ప్రేమ్‌జీత్‌సింగ్‌, ఫెడరేషన్‌ టెక్నికల్‌ చీఫ్‌ రజనీష్‌, మలేషియా కరాటే చీఫ్‌ అనంతన్‌, జాతీయ పోటీల టెక్నికల్‌ కన్వీనర్‌ రవీందర్‌, కాయ్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


ఓవరాల్‌ చాంపియన్స్‌గా  తెలంగాణ క్రీడాకారులు

జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ చీఫ్‌ మినిస్టర్‌ కప్‌-2020 పోటీల్లో ఆతిథ్య తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అత్యధిక పతకాలు, పాయింట్లు సాధించి ప్రధమస్థానంలో నిలువడంతో పాటు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు 370 పాయింట్లతో 152 పతకాలు, ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు 272 పాయింట్లతో 131 పతకాలు సాధించారు. 122 పాయింట్లతో 79 పతకాలు సాధించిన మధ్యప్రదేశ్‌ క్రీడాకారులు తృతీయ స్థానంలో నిలిచారు. logo