బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 24, 2020 , 01:27:36

పట్టణాలకు ‘ప్రగతి’ అందాలు

పట్టణాలకు ‘ప్రగతి’ అందాలు

విద్యానగర్‌ : పల్లెల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతిని నిర్వహించింది. రెండు విడుతలుగా పల్లె ప్రగతిని నిర్వహించింది. పారిశుద్ధ్యం, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యా ర్డ్‌లు, ఇంకుడు గుంతల నిర్మాణం, విద్యుత్‌ స్తంభాల మరమ్మతులు, ఇంటి పన్నుల వసూలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. రెండు విడతలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పట్టణాలను సైతం అద్దల్లా తీర్చిదిద్దాలనే  సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతి నిర్వహణకు పూనుకుంది.  సోమవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు పది రోజుల పాటు కార్యక్రమం సాగనున్నది. ఈ మేరకు అధికారులకు సై తం శిక్షణ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఇదే వరకే ప్రజాప్రతినిధులకు, కలెక్టర్లకు, అధికారులకు పట్టణ ప్రగతి పై దిశానిర్దేశం చేశారు. ఇందు కోసం అధికార యంత్రాంగం సన్నద్దమైంది. వార్డుల వారిగా కమిటీలను ఏర్పాటు చేసింది. వార్డు ఇన్‌చార్జులను నియమించింది.ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి  మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్నది.


సమస్యలకు పరిష్కారం.. 

పల్లె ప్రగతిలో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభించినట్లుగానే పట్టణాల్లో సైతం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. మురికి కాలువలు నుంచి దుర్గందం వెదజల్లకుండా, నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చివేయడం, పన్నులు వసూలు చేయడంతో పాటు వసతులు కల్పించనున్నారు. పట్టణ ప్రగతి అధికారులు  అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వైకుంఠధామాల నిర్మాణం తదితర కార్యక్రమాల పై దృష్టి సారించనున్నారు.


ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు

పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం నుంచి మార్చి 4వ  తేదీ వరకు పదిరోజుల పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కార్యాచరణ రూపొందించారు. కామారెడ్డిలో 49 వార్డులు, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో నాలుగు కమిటీలను ఎన్నుకున్నారు. యూత్‌ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్‌ సిటిజన్‌ కమిటీ, ప్రముఖుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. నాలుగు కమిటీల్లో మొత్తం 60 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. వార్డులో ఏర్పాటు చేయనున్న నాలుగు కమిటీలకు స్థానిక కౌన్సిలర్లు చైర్మన్‌గా, వార్డుకు నియమించే పురపాలనాధికారి, జిల్లా అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్స్‌ కమిటీలో ఉంటారు. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం పరిధిలోని సమస్యలను పరిష్కరించడం, పారిశుద్ధ్య పనులను, కరెంట్‌ సమస్యలను పరిష్కరించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. 


పట్టణ ప్రగతిలో చేపట్టే పనులు..

డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురికి గుంతలను పూడ్చడం.

విరివిగా మొక్కలు నాటడం. హరిత ప్రణాళికను రూపొందించడం.  

వార్డుల్లో నర్సరీల ఏర్పాట్లకు అనువైన స్థలాల ఎంపిక, స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయడం.

పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం. 

ప్రధాన రహదారులు,అంతర్గత వీధుల్లో రోడ్ల పరిస్థితిని మెరుగుపరచడం, గుంతలను పూడ్చడం. 

వైకుంఠధామాల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయడం.  

పొదలు, పిచ్చి చెట్లు తొలగించడం.

వెజ్‌,నాన్‌వెజ్‌ మార్కెట్‌లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని వాటి కోసం స్థలాలను ఎంపిక చేయడం. 

క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయడం. 

డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించడం. 

పబ్లిక్‌ టాయిలెట్స్‌, మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిటెల్స్‌ నిర్మించడం.

వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించడం.  

పట్టణ వాసులకు అవసరమైన పార్కింగ్‌ స్థలాలను గుర్తించడం.  అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసుకోవడం..

విద్యుత్‌ సరఫరా మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతులను అవలంబించడం.  వంగిన, తుప్పుపట్టిన రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను, ఫుట్‌పాత్‌లపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను, వేలాడే కరెంట్‌ తీగలను మార్చడం.  logo