సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 24, 2020 , 01:15:12

కాళేశ్వరం జలాలతో నిండు కుండలా వరద కాలువ

కాళేశ్వరం జలాలతో నిండు కుండలా వరద కాలువ

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : పునర్జీవ పథకం ద్వారా ఎదురేగి వచ్చిన కాళేశ్వరం జలాలతో వరద కాలువ నిండు కుండలా మారింది. కాలువ వెంట చెరువుల కింద యాసంగి పంటలకు నీరివ్వడానికి ఎస్సారెస్పీలో తగినంత నీటి నిల్వలు లేనందున ఒక టీఎంసీ కాళేశ్వరం జలాలను పునర్జీవ పథకం ద్వారా తరలించి వరద కాలువను నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు బుధవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాంపూర్‌ పంప్‌ హౌజులో రెండు మోటార్లను, శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాజేశ్వర్‌రావుపేట్‌లో రెండు మోటార్లను నిరంతరాయంగా నడుపుతూ వరద కాలువను నింపారు. ఆదివారం ఉదయానికల్లా 102వ కిలో మీటరు మొదలుకొని ఎస్సారెస్పీ వద్ద జీరో పాయింట్‌ వరకు వరద కాలువ కాళేశ్వరం జలాలతో నిండు కుండలా మారింది. దీంతో వరద కాలువ తూముల ద్వారా చెరువులకు నీటి విడుదల జరుగుతున్నది. నిజామాబాద్‌ జిల్లాలో ఎనిమిది తూముల ద్వారా 12 చెరువులు, పలు చెక్‌ డ్యాములకు నీరు అందించే వీలు ఏర్పడింది. చెరువులతోపాటు కాలువ వెంట మోటార్లు, బోరు బావుల ద్వారా సాగవుతున్న యాసంగి పంటలకు ఢోకా లేకుండా పోయింది. నిండు కుండలా మారిన వరద కాలువను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తూముల వద్ద పూజలు చేసి చెరువులకు నీటిని వదులుతున్నారు.


logo