సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 21, 2020 , 05:02:44

అభివృద్ధి పనులకు భారీగా నిధులు

అభివృద్ధి పనులకు భారీగా నిధులు

గత ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

  • చెక్‌డ్యాంలు, రోడ్ల నిర్మాణానికి మంజూరు..
  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి
  • డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పరిశీలన
  • అధికారులకు పలు సూచనలు

బాన్సువాడ రూరల్‌ : గత ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ శివారులో నిర్మించిన 500 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ, బీర్కూర్‌ ప్రజలకు, రైతులకు శాశ్వతంగా సాగు, తాగు నీటి ఇబ్బందులను దూరం చేసేందుకు బాన్సువాడ మంజీరలో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ. 15.98 కోట్లు, బీర్కూర్‌ వద్ద మంజీరలో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.28.29 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వీటి నిర్మాణాలు వర్షాకాలం చివరి వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్‌అండ్‌బీ నిధుల కింద నెమ్లి - నాచుపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి 1.02 కోట్లు, నస్రుల్లాబాద్‌ - రైతునగర్‌ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2కోట్లు, నస్రుల్లాబాద్‌  బొమ్మన్‌దేవ్‌పల్లి రోడ్డుకు రూ. 2 కోట్లు, నస్రుల్లాబాద్‌ వయా బైరాపూర్‌ వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 1.40 కోట్లు, మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నస్రుల్లాబాద్‌లో సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.35లక్షలు, కోటగిరి -ఎత్తొండ రోడ్డుకు రూ.80లక్షలు, బాన్సువాడ - బిచ్కుంద రోడ్డుకు రూ.65 లక్షలు, బుడ్మి-కొత్తాబాది రోడ్డుకు రూ. 10లక్షలు, బాన్సువాడ తాడ్కోల్‌ రోడ్డు నుంచి తాడ్కోల్‌ వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్లు పొతంగల్‌ - హెగ్డోలి రోడ్డుకు రూ.2.22 కోట్లు, వర్ని - నిజామాబాద్‌ రోడ్డుకు అదనంగా రూ.40లక్షలు, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రూ. 11 కోట్లు, బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు యూజీసీ గ్రాంటు కింద రూ.2 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పీఎం గ్రామీణ్‌ సడక్‌యోజన పథకం కింద 35 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.  


నిజాంసాగర్‌ నీటిని సద్వినియోగం చేసుకోవాలి 

నిజాంసాగర్‌ ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తున్న రైతులను ఆదుకునేందుకు రెండు విడతలుగా నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ద్వారా గురువారం నుంచి నీటి విడుదల ప్రారంభమైందని, మొదటి విడతగా పదిరోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అన్నారు. జక్కల్‌దాని తండా వద్ద నిజాంసాగర్‌ నీటి విడుదలను పరిశీలించినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌తో చర్చించి రెండు విడుతలుగా నీరు అందించేందుకు నిర్ణయం తీసుకొని నీటిని విడుదల చేశామన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, తాడ్కోల్‌ సర్పంచ్‌ రాజమణి, బాన్సువాడ పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు వెంకటి, రమాదేవి, నాయకులు నార్ల సురేశ్‌గుప్తా, గంగుల గంగారాం, కుమ్మరి రాజు, మల్లారెడ్డి, లక్ష్మాగౌడ్‌ తదితరులు ఉన్నారు.


logo