మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 19, 2020 , 01:32:12

‘పట్టణ ప్రగతి’ పరుగులు పెట్టాలి..!

‘పట్టణ ప్రగతి’ పరుగులు పెట్టాలి..!

గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక సాధించిన పారిశుద్ధ్య ప్రగతి స్ఫూర్తితో మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • పల్లె ప్రగతి స్ఫూర్తితో మున్సిపాలిటీల్లోనూ అమలుకు ప్రభుత్వం నిర్ణయం
  • వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు నిర్మాణాలపై ఫోకస్‌
  • మున్సిపాలిటీల వారీగా సిద్ధమవుతున్న కార్యాచరణ
  • ఈ నెల 24 నుంచి అమల్లోకి పట్టణ ప్రగతి కార్యక్రమం
  • కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక సాధించిన పారిశుద్ధ్య ప్రగతి స్ఫూర్తితో మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన పారిశుద్ధ్య ప్రణాళిక (సిటీ శానిటేషన్‌ ప్లాన్‌) తయారు చేసి డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సమర్పించాలని ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాలు ఇచ్చారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామ పంచాయతీల్లో సత్ఫలితాలు వచ్చాయి. పట్టణాల్లోనూ ఇదే మాదిరి కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టి పట్టణాలను సర్వాంగ సుందరంగా రూపుదిద్దాలని సర్కారు భావిస్తున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో మంగళవారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు నిర్వహించే పట్టణ ప్రగతిలో అవలంభించాల్సిన విధివిధానాలపై సీఎం కేసీఆర్‌ స్వయంగా అధికారులు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పల్లెల స్ఫూర్తితో పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునివ్వడంతో, అదే ఉత్సాహంతో పని చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, పాలక మండళ్లు సిద్ధం అవుతున్నాయి.


సమస్యలకు విరుగుడు..

గ్రామాలు, పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలకు చక్కని విరుగుడు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతమైన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం (పల్లె ప్రగతి)ని స్ఫూర్తిగా తీసుకొని పట్టణాల్లోనూ నిరంతరం కొనసాగించేలా కార్యాచరణ సిద్ధం అవుతున్నది. సెప్టెంబర్‌, జనవరి నెలల్లో రెండు విడతల్లో సాగిన పల్లె ప్రగతి ద్వారా అద్భుత ఫలితాలు రావడంతో పట్టణ ప్రగతిపై రాష్ట్ర సర్కారు సీరియస్‌గా దృష్టి సారించింది. గ్రామ పంచాయతీల్లో విజయవంతమైన పల్లె ప్రగతి మాదిరిగా పురపాలక శాఖ ఫిబ్రవరి 24 నుంచి పది రోజుల పాటు మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధం అవుతున్నది. తద్వారా అంతులేని నిర్లక్ష్యానికి కేరాఫ్‌గా మారిన మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఏర్పడనుంది. అంతేకాక పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం వెల్లివిరియనుంది. వార్డుల వారీగా పేరుకుపోయిన సమస్యలన్నింటికీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపశమనం లభించనుంది.


ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు...

పట్టణ ప్రగతిలో నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలంటే తప్పనిసరిగా వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పురపాలక సంఘంలో ఒక్కో వార్డుకు నాలుగు వార్డు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక వార్డును ఒక యూనిట్‌గా తీసుకుని పట్టణ ప్రగతి చేపట్టనున్నారు. ప్రతి వార్డుకూ ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ఈ కమిటీలో సంక్షేమ సంఘాలు, కుల సంఘాలు, ఇతర గ్రూపులు, వ్యక్తులతో గరిష్టంగా 15 మంది సభ్యులతో వార్షిక రొటేషన్‌ ద్వారా ఏర్పాటు చేయాలి. ఆ వార్డుకు చెందిన గ్రూపునకు సంబంధిత సమస్యలను అప్పగించాలి. ఈ నెల 24 నుంచి మున్సిపాలిటీ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలు కానుంది. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం పరిధిలోని సమస్యలను పరిష్కరించడం, పారిశుద్ధ్యం, కరెంట్‌ సమస్యలకు సమూలంగా చెక్‌ పెట్టనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో నిర్మించిన వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌, శ్మశానవాటికలను సందర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. 


పట్టణ ప్రగతి లక్ష్యాలివీ.. 

*డ్రైనేజీలు శుభ్రం చేయాలి 

* మురికి గుంతలు పూడ్చాలి

*విరివిగా మొక్కలు నాటాలి

*హరిత ప్రణాళికను రూపొందించాలి

*వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. 

*స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. 

*పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి. 

*ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో రోడ్ల పరిస్థితిని మెరుగుపర్చాలి. 

*వైకుంఠధామాల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలి. 

*పొదలు, మురికి కాలువలు, తుమ్మ చెట్లను నరికి వేయాలి. 

*వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని వాటి కోసం స్థలాలను ఎంపిక చేయాలి. 

*క్రీడలను ప్రోత్సహించేందుకు మైదానాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయాలి. 

*డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలి. 

*పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలి. 

*మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌ నిర్మించాలి. 

*వీటికి అవసరమైన స్థలాలను గుర్తించాలి. 

*టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను కేటాయించాలి. 

*వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించే వరకు వారిని ఇబ్బంది పెట్టొద్దు.

*పట్టణ వాసులకు అవసరమైన పార్కింగ్‌ స్థలాలు గుర్తించాలి. 

*అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేయాలి. 

*పట్టణ విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆధునిక పద్ధతులను అవలంభించాలి. 

*ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థ ఉండాలి. 

*వంగిన, తప్పుపట్టిన, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను, ఫుట్‌పాత్‌లపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలి. వేలాడే కరెంట్‌ తీగలను సరి చేయాలి.


పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహిస్తాం. మున్సిపాలిటీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధికి కృషిచేస్తాం. అభివృద్ధిలో వెనుకబడిన వార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దుతాం. 

- నిట్టు జాహ్నవి, కామారెడ్డి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ 


ఆకుపచ్చ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. 

పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్‌, తాగునీరు, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ప్రజలతో కలిసి విజయవంతం చేస్తాం. సీఎం కేసీఆర్‌ ఇచ్చే నిధులతో పట్టణ రూపురేఖలు మార్చేందుకు శ్రమించి పనిచేస్తాం. కలిసి పనిచేస్తే కానిదేది లేదని సీఎం సందేశంతో భరోసా కలిగింది. పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరుతున్నా.

- జంగం గంగాధర్‌, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌  


పట్టణ ప్రగతిపై అవగాహన వచ్చింది

సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో పట్టణ ప్రగతిపై అవగాహన వచ్చింది. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాకు అభివృద్ధి ఎలా చేయాలో స్పష్టత వచ్చింది. సిద్దిపేట ఆదర్శ మార్కెట్‌ను చూసిన తర్వాత ఎల్లారెడ్డిలో చేపట్టాల్సిన పనులపై నిర్ణయాలు తీసుకుంటాం. పట్టణంలో మొక్కలు పెంచి గ్రీనరీగా మారుస్తాం. పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అవగాహన కల్పించి పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడతాం. 


logo
>>>>>>