శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 19, 2020 , 01:29:40

అందరి చూపు..డీసీసీబీ వైపు!

అందరి చూపు..డీసీసీబీ వైపు!

సహకార సంఘాల ఎన్నికలు ముగియడంతో ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. పాలకవర్గాల ఏర్పాటుకు ఈ నెల 20న సహకార శాఖ ద్వారా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనుంది.

  • రేపు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్న సహకార శాఖ
  • డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలో తీవ్ర పోటీ
  • డైరెక్టర్‌ పోస్టుల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ
  • చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పేర్లను ఖరారు చేయనున్న సీఎం
  • డైరెక్టర్‌ పోస్టులకు పేర్లు వెల్లడించనున్న ఎమ్మెల్యేలు, మంత్రి

సహకార సంఘాల ఎన్నికలు ముగియడంతో ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. పాలకవర్గాల ఏర్పాటుకు ఈ నెల 20న సహకార శాఖ ద్వారా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనుంది. డీసీసీబీలో 21 మంది డైరెక్టర్‌ స్థానాలుండగా పీఏసీఎస్‌ల ద్వారా 16 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. మిగిలిన ఐదుగురి డైరెక్టర్ల ఎన్నికను బీ-కేటగిరిలోని సహకార 

సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు.  ఎస్సీకి 4, ఎస్టీ 2, బీసీ 4, జనరల్‌ 11 చొప్పున రిజర్వేషన్‌ ఖరారు చేశారు.  డీసీఎంఎస్‌లోని 10 మంది డైరెక్టర్‌ స్థానాల్లో ఏ-కేటగిరిలోని

 6 డైరెక్టర్‌ పోస్టులను  పీఏసీఎస్‌ చైర్మన్లు, మిగిలిన 4 డైరెక్టర్‌ పదవులను 

బీ-కేటగిరిలోని సంఘాల అధ్యక్షులు ఎన్నుకుంటారు. ఎస్సీలకు 2, 

ఎస్టీలకు 1, బీసీలకు 2, జనరల్‌కు 5 రిజర్వేషన్ల చొప్పున నిర్ణయించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పేర్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేయనున్నారు. 

- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సమరంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల పందేరం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక పీఏసీఎస్‌లను కైవసం చేసుకున్న అధికార పార్టీలో డైరెక్టర్‌ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రసన్నం చేసుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు డైరెక్టర్‌తో సహా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం కీలక నేతలు బరిలో నిలిచారు. వీరి పేర్లను టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ స్వయంగా వెల్లడించనున్నట్లుగా తెలుస్తున్నది. డైరెక్టర్‌ పదవులకు మాత్రం ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులంతా కలిసి ఏకాభిప్రాయంతో పేర్లను నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల కూర్పునకు రేపు సహకార శాఖ ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఎన్నికల ప్రకటనకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేశారు.


ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ బలం ఇదీ...

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) పరిధి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కొనసాగనుండడంతో రెండు జిల్లాల్లో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఉద్యమ నేపథ్యం, పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ కీలకమైన నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు తంటాలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 144 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 55 సహకార సంఘాలకు ఎన్నికలు ముగిశాయి. పార్టీ రహితంగా జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలో 144 పీఏసీఎస్‌లకు 133 మంది పీఏసీఎస్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ వారే ఉన్నారు. కాంగ్రెస్‌కు 6, ఇతరులు 5 చోట్ల మాత్రమే పీఏసీఎస్‌ పీఠాలను దక్కించుకున్నారు. డీసీసీబీలో 21 మంది డైరెక్టర్‌ స్థానాలుండగా పీఏసీఎస్‌ల ద్వారా 16 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. మిగిలిన ఐదుగురి డైరెక్టర్ల ఎన్నికను బీ-కేటగిరిలోని సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లోని 10 మంది డైరెక్టర్‌ స్థానాల్లో ఏ-కేటగిరిలోని 6 డైరెక్టర్‌ పోస్టులను పీఏసీఎస్‌ ఛైర్మన్‌లు ఎన్నుకుంటారు. మిగిలిన 4 డైరెక్టర్‌ పదవులను బీ-కేటగిరిలోని సంఘాల అధ్యక్షులు ఎన్నుకుంటారు.


చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పేర్లను వెల్లడించనున్న సీఎం...

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాల ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల కూర్పుపై పడింది. సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల్లో డైరెక్టర్‌ పదవులపై కన్నేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఎక్కువ మంది పీఏసీఎస్‌ చైర్మన్లు ఉండడంతో గంప గుత్తగా డీసీసీబీ పాలకవర్గంలోని మొత్తం డైరెక్టర్‌ పదవులు గులాబీ నేతలకే వచ్చే అవకాశాలున్నాయి. డైరెక్టర్ల నుంచే డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎన్నికవుతారు. వీటిని సీఎం కేసీఆర్‌ ఖరారు చేయనున్నట్లు సమాచారం. డైరెక్టర్‌ పదవుల బాధ్యతను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో చాలా మంది వారి చుట్టూ తిరుగుతున్నారు. ఏ జిల్లాలో నుంచి ఎవరెవరిని డైరెక్టర్లుగా పోటీలో దించాలనే విషయంపై ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు చర్చిస్తున్నారు. రెండు జిల్లాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలనే ఏకాభిప్రాయంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. 


రిజర్వేషన్లు ఇలా...

డీసీసీబీలో 21 డైరెక్టర్ల పదవులుంటాయి. వీటిలో ఏ-కేటగిరీకి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన చైర్మన్లు 16 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, బీసీలకు 2 డైరెక్టర్‌ పదవులు రిజర్వేషన్‌ కల్పించారు. మిగిలిన 10 డైరెక్టర్‌ పదవులను జనరల్‌ కోటా కింద నిర్ధేశించారు. మరో 5 డైరెక్టర్లను బీ-కేటగిరీకి చెందిన మత్స్య, చేనేత, గొర్రెల పెంపకం దారుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన చైర్మన్లు ఎన్నుకుంటారు. బీ-కేటగిరీ సంఘాలు ఎన్నుకునే 5 డైరెక్టర్ల పదవుల్లో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 2, జనరల్‌ 1 చొప్పున రిజర్వేషన్లు కల్పించారు. డీసీఎంఎస్‌లో మొత్తం 10 మంది డైరెక్టర్లుంటారు. వీరిలో ఏ -కేటగిరిలో జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీలో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 1, ఓసీలకు 3 చొప్పున మొత్తం 6 డైరెక్టర్లకు రిజర్వేషన్లు వర్తింపజేశారు. బీ-కేటగిరిలో 4 డైరెక్టర్‌ పోస్టులకు ఎస్సీలకు 1, బీసీలకు 1, ఓసీలకు 2 చొప్పున రిజర్వేషన్‌ నిర్ణయించారు. 


logo