బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 19, 2020 , 01:20:12

సీఈ యూనిట్‌గా ఉమ్మడి జిల్లా సాగు నీటి నిర్వహణ

సీఈ యూనిట్‌గా ఉమ్మడి జిల్లా సాగు నీటి నిర్వహణ

జిల్లాలో సాగునీటి పారుదల నిర్వహణ ఇక చీఫ్‌ ఇంజినీరు కిందకు రానుంది. ఇప్పటిదాకా వివిధ స్థాయిల్లో, వివిధ రకాల నిర్వహణ ఉండేది. దీంతో నిర్వహణ, సాగునీటి ప్రణాళికల అమలులో సమన్వయం సకాలంలో కుదరక జాప్యం చోటు చేసుకునేది.

  • శాఖల మధ్య సమన్వయ సమస్య దూరం
  • పెరగనున్న పర్యవేక్షణ

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : జిల్లాలో సాగునీటి పారుదల నిర్వహణ ఇక చీఫ్‌ ఇంజినీరు కిందకు రానుంది. ఇప్పటిదాకా వివిధ స్థాయిల్లో, వివిధ రకాల నిర్వహణ ఉండేది. దీంతో నిర్వహణ, సాగునీటి ప్రణాళికల అమలులో సమన్వయం సకాలంలో కుదరక జాప్యం చోటు చేసుకునేది. అన్ని రకాల సాగునీటి నిర్వహణను చీఫ్‌ ఇంజినీరు యూనిట్‌గా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించడంతో రాష్ట్రంలో నీటి పారుదల శాఖ నిర్వహణ వ్యవహారాలు 11 సీఈ యూనిట్లుగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థాయిలో సీఈ యూనిట్‌ ఏర్పడనుంది.

ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ జలాశయాలు ఉన్నాయి. ఎస్సారెస్పీపై ఆధారపడి నిర్మించిన గుత్ప, అలీసాగర్‌, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. లెండి, కౌలాస్‌నాలా, రామడుగు, పోచారం ప్రాజెక్టు, చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీల కింద సాగు నీటి సౌకర్యం పెద్ద ఎత్తున కల్పించే పనులు జరుగుతున్నాయి. సుమారు 6.82 లక్షల ఎకరాల సాగు జరుగుతుంది. ఇప్పటివరకు ఈ భూములకు సాగునీటి నిర్వహణ నాలుగైదు శాఖలకు సంబంధం ఉండేది. ఈ శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ పోయే క్రమంలో కొంత జాప్యం తప్పకపోయేది. ఎస్‌ఈ స్థాయి యూనిట్‌గా నిర్వహణ జరిగేది. 

సాగు నీటి వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తుండడంతో నిజామాబాద్‌ సీఈ నిజామాబాద్‌ యూనిట్‌గా సాగునీటి నిర్వహణ ఒకే గొడుగు కిందకు రానుంది. ఇందుకు సంబంధించిన జీవో రావడంతో సీఈ యూనిట్‌గా ఒకే గొడుగు కిందకు నిర్వహణ రావడంతో సమన్వయం పెరుగుతుంది. వివిధ కార్యాలయాల ద్వారా పరిపాలన, నిర్వహణ జరిగినా పర్యవేక్షణ మరింతగా పెరుగనుంది. ఎప్పటిలాగే ఎస్సారెస్పీ సీఈ కిందకు ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీ వరకు నిర్వహణ ఉంటుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం, వరద కాలువ, లక్ష్మి కాలువ దీని పరిధిలోనే ఉంటాయి. నిజామాబాద్‌ సీఈ పరిధిలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు, నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు, గుత్ప, అలీసాగర్‌, చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి ఎత్తిపోతల పథకాలు, లెండి, కౌలాస్‌నాలా, రామడుగు, పోచారం ప్రాజెక్టు, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద సాగు నిర్వహణ మొత్తం సీఈ పర్యవేక్షణలో జరుగుతుంది. 


logo
>>>>>>