శనివారం 28 మార్చి 2020
Kamareddy - Feb 18, 2020 , 01:28:32

‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో హరితకానుక

‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో హరితకానుక

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 66వ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లా కేంద్రంలో వైభవోపేతంగా జరిగాయి. గల్లీ గల్లీలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించారు. మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆధ్వర్యంలో రాశివనంలో హరిత కానుక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ డా.ఎ.శరత్‌ హాజరయ్యారు. 2015, జూన్‌ 10న హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ స్వయంగా నాటిన అడవి మల్లె మొక్కను చూసి కలెక్టర్‌ ఆనందించారు. సీఎం నాటిన మొక్క నేడు ఏపుగా పెరిగి చెట్టుగా మారింది. చెట్టుకు నీరు పోసిన అనంతరం ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లనేరడి మొక్కను కలెక్టర్‌ శరత్‌ నాటి నీళ్లు పోశారు. 


ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ దోత్రేలు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. డిగ్రీ కళాశాల ప్రధాన ద్వారం ఎదుట ఐదేండ్ల క్రితం సీఎం, స్పీకర్‌ పోచారం, మంత్రులు నాటిన మొక్కలను అతిథులు తిలకించారు. అనంతరం రాశివనంలో కొద్ది సేపు కాలక్షేపం చేసిన కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు ఇప్పటివరకు నాటిన మొక్కలు, వాటి సంరక్షణ తీరుతెన్నులను పరిశీలించారు. కార్యక్రమంలో కామారెడ్డి బ్యూరో చీఫ్‌ జూపల్లి రమేశ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ భరత్‌ గౌడ్‌, కామారెడ్డి ఆర్‌సీ ఇన్‌చార్జి ఇంజమూరి వెంకటేశ్‌, రిపోర్టర్లు గడ్డమీది సంజీవ్‌, కుసుమ శ్రీకాంత్‌ కుమార్‌, ముద్రకోల రమేశ్‌, రవీందర్‌, సురేశ్‌, నగేష్‌తో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. logo