బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 18, 2020 , 01:27:39

గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి

గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : రెవెన్యూకు సంబంధించిన సమస్యలను గ్రామాల్లో పర్యటించి పరిష్కరించాలని కలెక్టర్‌ శరత్‌ తహసీల్దార్లను ఆదేశించారు. ఎల్లారెడ్డిలో మొదటిసారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యను పరిశీలించి జెన్యూన్‌గా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం తహసీల్దార్లు గ్రామాల్లో పర్యటించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజన్‌లోని తహసీల్దార్లు ప్రతీ గ్రామానికి వెళ్లి, అక్కడ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. కబ్జాలో ఉన్న వారికి పట్టా పాస్‌బుక్‌లు ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని తహసీల్దార్లను ప్రశ్నించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. గ్రామాల్లో పర్యటించే ముందు చాటింపు వేయించాలని, మార్చి నెలాఖరులోగా గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 


సమస్య పరిష్కారం కాకపోతే బస్సు చార్జీలు ఇస్తా.. 

గాంధారి మండలంలోని రామలక్ష్మణ్‌ పల్లి గ్రామానికి చెందిన సంతోష్‌ 1-20 గుంటలకు సంబంధించిన పాస్‌ పుస్తకం రావడం లేదని కలెక్టర్‌ శరత్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ సంగమేశ్వర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. శనివారంలోగా సమస్యను పరిష్కారం చేస్తామని, సమస్య పరిష్కారం కాకుంటే బస్సు చార్జీలు చెల్లిస్తానని కలెక్టర్‌ అర్జీదారుడితో అన్నారు. పలువురు అటవీ భూమికి పట్టాలు అందజేయాలని దరఖాస్తు చేసుకున్నారని, వారికి పట్టాలు ఇవ్వమని స్పష్టం చేశారు. చాలా ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వ భూమిలో పంటలు సాగు చేస్తున్న వారికి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెంటనే వారికి పాస్‌బుక్కులు ఇవ్వాలని అన్నారు. గండివేట్‌ వీఆర్‌ఏపై ఆయన భార్య ఫిర్యాదు చేయగా, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డీవో దేవేందర్‌ రెడ్డికి సూచించారు. 


ఇండ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యేను కలవండి..

ప్రజావాణి కార్యక్రమంలో పలువురు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు, స్థలంలో ఇండ్లు నిర్మించుకునాలనుకునే వారు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించాలని సూచించారు. అటవీ భూముల సమస్యలపై పలువురు ఫిర్యాదు చేయగా.. వాటిపై విచారణ జరిపి వెంటనే పరిష్కరించాలని అటవీ శాఖ అధికారిణి వసంతకు సూచించారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 67 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 41 రెవెన్యూ శాఖకు, 26 మిగితా శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. కార్యక్రమంలో డీఆర్డీవో చంద్రమోహన్‌ రెడ్డి, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ శేషారావ్‌, జిల్లా స్థాయి అధికారులు చంద్రశేఖర్‌, నాగేంద్రయ్య, జగన్నాథచారి, శ్రీనివాస్‌, రాంబాబు, చందర్‌, రాజు, వసంత, ఝాన్సీరాణి, షబానా, ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ డీఈఈ హన్మాగౌడ్‌, రోడ్లు భవనాల శాఖ డీఈఈ నారాయణ, తహసీల్దార్లు స్వామి, నారాయణ, సయీద్‌ అహ్మద్‌, సంగమేశ్వర్‌ పాల్గొన్నారు.


logo