సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 17, 2020 , 03:24:49

ఆధునిక అశోకుడికి ‘హరిత’మాల..!

ఆధునిక అశోకుడికి ‘హరిత’మాల..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మొక్కలు నాటడం అనేది వేరే వాళ్ల పని కాదు. ఇది మన సొంత పని. మనిషి జీవితంతో అడుగడుగునా మొక్క పెనవేసుకుని ఉంది. మనిషి పుట్టినప్పుడు ఊగే ఊయల నుంచి... చనిపోయినప్పుడు కాల్చే చితి వరకు అంతా చెట్టు ద్వారా వచ్చే కట్టెతో ముడి పడిందే. ప్రకృతిని ఎక్కడైతే పూజిస్తారో.. అక్కడే ప్రకృతి హర్షిస్తుంది.. వర్షిస్తుంది. ఇంట్లో పిల్లలను ఎలా పెంచి పోషిస్తున్నామో... మొక్కలను అలా పెంచాల్సిన అవసరం ఉంది. వర్షాలు బాగా కురిసి చెరువులు, కుంటలు నిండాలంటే వృక్ష సంపద ఎంతో అవసరం. పాడి పంటలతో రాష్ట్రం పచ్చని తెలంగాణగా విరాజిల్లాలంటే వాడవాడలా హరితవనాలు పెంచాలి. కరువును శాశ్వతంగా నివారించడానికి చక్కని ఉపాయం కూడా మొక్కల పెంపకమే. ఇంతటి మహత్తర కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి దిగ్విజయంగా ఐదు విడుతలను పూర్తి చేసుకుని తెలంగాణ సర్కారు హరిత స్ఫూర్తితో ముందుకు సాగుతున్నది. హరితహారం పేరుతో సీఎం కేసీఆర్‌ తలపెట్టిన మొక్కలు నాటే కార్యక్రమం వాడవాడలా విస్తరించి మహాయజ్ఞంలా మారింది. నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదినం కావడంతో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ నేతృత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున మొక్కలు నాటి కేసీఆర్‌కు హరిత నీరాజనం పలికేందుకు సిద్ధమవుతున్నారు. 


సీఎం జన్మదిన వేళ హరితాశయం...

తరిగిపోతున్న అడవులను 33 శాతానికి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. వానాకాలం సీజన్‌లో దిగ్విజయంగా ఐదో విడత హరితహారం ముమ్మరంగా సాగింది. జిల్లాలోని 22 మండలాల్లో, 526 గ్రామ పంచాయతీలో ఒక్కో జీపీలో 40 వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ ఎత్తున భాగస్వామ్యమయ్యారు. వాటి సంరక్షణకు సరైన చర్యలు చేపడుతూ సామాజిక అడవులను విస్తరించేలా పాటుపడ్డారు. అటవీ భూములు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, రహదారులు, పొలం, కాలువ గట్లు, ఆలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ కనీసం ఐదు నుంచి పది మొక్కలు పంపిణీ చేశారు. ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో మొక్కలు నాటించారు. గ్రామాల్లో నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడేలా, నిర్లక్ష్యం చేస్తే  యజమానికి జరిమానా విధించేలా చర్యలకు ఉపక్రమించారు. 33 శాతానికి అటవీ విస్తీర్ణాన్ని తీసుకుపోవాలనే కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం అడుగులు వేసింది. తాజాగా సీఎం జన్మదినం సందర్భంగా భారీగా మొక్కలు నాటేందుకు ఊరూ వాడ రెడీ అయ్యింది.


ఒకే రోజు లక్ష మొక్కలు...

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను స్ఫూర్తిమంతంగా నిర్వహించేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో 22 మండలాల్లో లక్ష మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 526 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో 50 మొక్కలు, మండల కేంద్రాల్లో 500 మొక్కలు నాటాలని కలెక్టర్‌ నిర్ణయించారు. తద్వారా జీపీల్లో 50 వేలకు పైగా మొక్కలను నాటుతుండగా.. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున నీడనిచ్చే మొక్కలు నాటాలని భావిస్తున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 4 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కామారెడ్డి పురపాలక సంఘంలో 2,500 మొక్కలు, బాన్సువాడలో వేయి మొక్కలు, ఎల్లారెడ్డి పురపాలకలో 500 మొక్కలు నాటేలా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఉదయం ప్రభుత్వ కార్యాలయాల పనివేళల సమయంలో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి మొక్కలు నాటే విధంగా కలెక్టర్‌ శరత్‌ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సీఎం కేసీఆర్‌కు జన్మదినం సందర్భంగా మొక్కలను నాటి హరిత సందేశంతో కూడిన శుభాకాంక్షలను అందించనున్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్ష మొక్కలు నాటడం ద్వారా సమాజానికి వన సందేశాన్ని గట్టిగా తీసుకుపోవాలన్న సంకల్పంతో కలెక్టర్‌ శరత్‌ పట్టుదలతో ఉన్నారు.


logo