గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 17, 2020 , 03:23:54

సహ ‘కారు’.. జోరు..!

సహ ‘కారు’.. జోరు..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో ప్రాదేశిక స్థానాలకు జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే, పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మాత్రం పలు చోట్ల ఉద్రిక్తతలకు, ఉత్కంఠభరిత వాతావరణానికి దారి తీసింది. పదవుల కోసం భారీగా ఆశావాహులుండడంతో క్యాంపు రాజకీయాలు ఆదివారం ఉదయం నామినేషన్ల గడువు ముగిసే వరకు సాగింది. ఎవరికి వారు ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం తీవ్రంగా శ్రమించి, చివరకు టీసీలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మొత్తం 55 సొసైటీలకు జరిగిన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల పందెరంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక సహకార సంఘాల్లో విజయ ఢంకా మోగించింది. 51 చోట్ల పీఏసీఎస్‌ పీఠాలను కైవసం చేసుకుంది. రెండు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ, ఒకరు స్వతంత్ర అభ్యర్థి పీఏసీఎస్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి సహకార సంఘంలో టీసీలెవ్వరూ హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. పిట్లం మండలం చిల్లర్గి, పెద్దకొడప్‌గల్‌ పీఏసీఎస్‌లలో వైస్‌చైర్మన్‌ ఎన్నిక జరుగలేదు.


కారు జోరు...

సహకార సంఘాల ఎన్నికలంటేనే పూర్తిగా రైతులకు సంబంధించిన వ్యవహారం. ఇందులో వ్యవసాయదారులకే ఓట్లుంటాయి. అన్నదాతల మేలు కోసం నిర్వహించే సహకార ఎన్నికల్లో రాజకీయ పార్టీల పరోక్ష పాత్రతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పురపాలక ఎన్నికల్లో పీఠాలను కైవసం చేసుకుని జోరు మీదున్న టీఆర్‌ఎస్‌కు అన్నదాతల సంపూర్ణ మద్దతు దక్కడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పోరులోనూ ప్రతిపక్షాలను చిత్తు చేసి గులాబీ పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా, బీజేపీ మద్దతుదారులైతే జాడ లేకుండా పోయారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌, ధాన్యం కొనుగోళ్లు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తూ కేసీఆర్‌ సర్కారు రైతులకు మేలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రయోజనాలను గుర్తు పెట్టుకుని రైతులోకమంతా టీఆర్‌ఎస్‌ బలపర్చిన వారినే సొసైటీల్లో టీసీలుగా, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోవడం విశేషం.


హోరాహోరీగా...

పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జిల్లాలో రసవత్తరంగా సాగింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు అనేక చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. పలుచోట్ల బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను ఆశించిన వ్యక్తుల సంఖ్య భారీగా ఉన్న చోట్ల ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో రహస్య ఓటింగ్‌ నిర్వహించడంతో శిబిరాల్లో ఉన్నటువంటి టీసీలు ఎవరికి ఓటు వేశారో? ఎవరికి పదవిని కట్టబెట్టారో అన్నదీ ఫలితాల వరకూ ఉత్కంఠకు గురి చేసింది. లింగంపేట సొసైటీలో సాయంత్రం 6 గంటల వరకూ తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య ఫలితాలు వెల్లడయ్యాయి. 55 సొసైటీల్లో అత్యధిక సొసైటీలను టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. 51 సొసైటీలపై టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే జెండా ఎగురవేశారు. నల్లమడుగు, దామరవంచ పీఏసీఎస్‌లను కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులే పీఠాలను కైవసం చేసుకున్నారు. నల్లమడుగులో వైస్‌ చైర్మన్‌ మాత్రం టీఆర్‌ఎస్‌ బలపర్చిన టీసీకే పదవి దక్కడం విశేషం. ఇదిలా ఉండగా దేమికలాన్‌లో పీఏసీఎస్‌ చైర్మన్‌ పీఠం దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థి త్వరలోనే గులాబీ గూటికి చేరే అవకాశాలున్నట్లు సమాచారం.


దుర్కి ఎన్నిక వాయిదా...

నస్రుల్లాబాద్‌ మండలంలోని దుర్కి సహకార సంఘంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను రిటర్నింగ్‌ అధికారి వాయిదా వేశారు. 13 టీసీలు ఇక్కడ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. చైర్మన్‌ ఎన్నిక సమయానికి ఎవరూ రాకపోవడంతో ఒంటి గంట వరకూ చూసిన అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు భిక్కనూరు మండలంలోని బస్వాపూర్‌ సొసైటీలో 2వ నంబర్‌ టీసీ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. జుక్కల్‌ నియోజకవర్గంలోని పెద్దకొడప్‌గల్‌ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, పిట్లం మండలంలోని చిల్లర్గి సొసైటీ వైస్‌ చైర్మన్‌ పదవులకు నామినేషన్లు ఎవరూ వేయలేదు. దీంతో ఈ ఎన్నికను అధికారులు వాయిదా వేయాల్సి వచ్చింది. వాయిదా పడిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నేడు నిర్వహించనున్నారు. 


logo
>>>>>>