సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 17, 2020 , 03:18:37

నీటి కోసమే.. మూడో ప్రపంచయుద్ధం

నీటి కోసమే.. మూడో ప్రపంచయుద్ధం

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: మూడో ప్రపంచ యుద్ధమంటూ జరిగితే నీటి కోసమే జరుగుతాయని వాటర్‌మన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్‌ రాజేందర్‌ సింగ్‌ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గోదావరి జలయాత్రలో భాగంగా ‘జలసాక్షరత, జలహక్కులు, బాధ్యతలు’ అనే అంశంపై ఆదివారం మధ్యాహ్నం కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సమావేశ మందిరంలో అవగాహన సదస్సు ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు అతిథులు మొక్కలు నాటారు. ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు అతిథులకు గౌరవవందనం చేసి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వేదిక పక్కన మొక్కకు నీటిని పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన వాటర్‌ మన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్‌ రాజేందర్‌సింగ్‌ ‘జలసాక్షరత, జలహక్కులు- బాధ్యతలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. భూగర్భ తాపాన్ని తగ్గించడం కోసం, వాతావరణ సమతుల్యం కోసం నదీ జలాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. స్వయం, క్రమశిక్షణతో నీటి భద్రతను ఏర్పర్చవచ్చని పేర్కొన్నారు. భారతదేశంలో నదిని ఒక దేవతగా భావిస్తారని, తల్లిని ఏ విధంగానైతే సంరక్షించుకుంటామో నదినీ అలానే చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యూజిలాండ్‌లో మొట్టమొదటి సారిగా నదీజలాల సంరక్షణ కోసం అక్కడి ప్రజలు కృషి చేశారని గుర్తు చేశారు. నదికి, కాలువకు ఉన్న తేడాలను ఆయన స్పష్టంగా వివరించారు. నది సహజమైందని, కాలువ కృత్రిమమైందన్నారు. గోదావరిలో పేరుకుపోయిన మలినాలను తగ్గించడం కోసం ఏ చోటనైతే ఉప్పొంగుతున్న నది పరవళ్లు ఉన్నాయో అక్కడ చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేయడం, గోదావరి పునః సంయోజన కోసం ప్రయత్నించడం వంటివి చేయాలని సూచించారు. తాను చేపట్టిన కార్యంలో నిర్మల్‌ గంగా ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా నీటి మీద ప్రయోజనవంతమైన ప్రణాళికలను వేసి సంరక్షించుకుంటున్నారని గుర్తు చేశారు. తాను రాజస్థాన్‌లో నదుల్లో నీటి శాతాన్ని పెంచి వాతావరణాన్ని ఏ విధంగా సమతౌల్యం చేశారో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. తన గొంతుక నీటి కోసమేనని తెలిపారు. గోదావరి ప్రవహిస్తున్న ప్రదేశాలన్నింటినీ బ్రహ్మగిరి పర్వతం నుంచి మొదలుకొని నాసిక్‌, గుల్బర్గా, ఔరంగబాద్‌, గురుద్వార్‌, జాల్నా, పర్బని, నాందేడ్‌ మొదలైన ప్రదేశాల్లో జలసాక్షరత కేంద్రాలను ఏర్పాటు చేస్తూ గోదావరి యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. సమాజంలో నేడు నీటిపైన అవగాహన కలిగిన వారే గురువులుగా వెలుగొందుతున్నారని గుర్తు చేశారు. 


టీయూలో సైన్స్‌ కోర్సులో జలవనరుల మీద ప్రత్యేక పాఠ్యాంశాలున్నాయని, వారందరికీ ఈ అవగాహన సదస్సు ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జలసాక్షరత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానికి కన్వీనర్‌గా డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ను నియమిస్తూ 11 మంది సభ్యులను కేటాయించారు. జలసంరక్షణ మీద విద్యార్థులు, అధ్యాపకులందరూ ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్‌ వి.త్రివేణి రచించిన ‘అలుగు’ వ్యాస సంపుటిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్‌ సీహెచ్‌ ఆరతి, గోదావరి జలయాత్ర నాసిక్‌ కేంద్రం సభ్యుడు రాజేశ్‌ పండిట్‌, ద్రువాంశ్‌ ఆర్గనైజేషన్‌ చైర్‌పర్సన్‌ మధులిక, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఫోరం చైర్మన్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, టీఐటీఏ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌కుమార్‌ మక్తాల, స్థానిక రైతులు నర్సింహానాయుడు, కరుణాకర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణాబాయి, డాక్టర్‌ జమీల్‌, భాస్కర్‌, వినోద్‌కుమార్‌, తెలంగాణ శంకర్‌, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


logo