బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 14, 2020 , 03:50:00

మద్దతు ధర ప్రస్తావనేది..?

మద్దతు ధర ప్రస్తావనేది..?

‘లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేస్తున్న పసుపునకు ఇప్పటి వరకు మద్దతు ధర లేదు.. దీనికోసం మా ఆవేదన.. ఆరాటం..  ఎన్నికల్లో అర్వింద్‌ మాటిచ్చి గెలిచాడు.. ఇప్పుడు మోసం చేశాడు. స్పైసెస్‌ బోర్డు మాకెందుకు? మాకు కొత్తగా సాగు ఎలా చెయ్యాలో నేర్పుతారా? ఇదా మేం కోరుకున్నది. మద్దతు ధర ఇవ్వండి బాబు.. అంటే.. బడా వ్యాపారులకు మేలు చేసేలా స్పైసెస్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి రైతులకు ఏదో మేలు చేస్తున్నామనే మాటలెందుకు?’.. ఇదీ రైతులు ఆవేదన. స్పైసెస్‌బోర్డు పేరుతో నగరంలో గురువారం నిర్వహించిన తొలి సమావేశం  

అభాసుపాలైన వైనం.

- నిజామాబాద్‌ నమస్తే తెలంగాణ ప్రతినిధి/ ఇందూరు 

  రైతులు స్సైసెస్‌ బోర్డుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న  అర్వింద్‌ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. దీనివల్ల పసుపు రైతుల కష్టాలు తీరుతాయనే రీతిలో స్పందించారు. రైతులకు దీనిగురించి పూర్తిగా అర్థం కావడంతో తీరా గురువారం నిర్వహించిన సుగంధ ద్రవ్యాల కొనుగోలుదారు, విక్రేతల సమావేశంలో వారు భగ్గుమన్నారు. దశాబ్దాలుగా పసుపు రైతుల బాధలేంటో తెలిసీ.. మళ్లీ కథ మొదటికొచ్చిందని, వంగడాలు, నాణ్యత, తర్పీదు.. అనే మాటలు వల్లెవేయడంతో రైతుల కడుపు రగిలిపోయింది. దీంతో వారు వెంటనే సమావేశాన్ని బహిష్కరించి బయటకొచ్చేశారు. అక్కడే ఉన్న మీడియాతో తమ ఆవేదనను వెలిబుచ్చారు. 

కొండంత రాగం తీసి..

నగరంలోని హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషన్‌లో ఉదయం సుగంధ ద్రవ్యాల కొనుగోలు, విక్రయదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్పైసెస్‌ బోర్డు సభ్యుడు విక్రమ్‌రెడ్డి హాజరయ్యారు. కొనుగోలు, విక్రయదారులకు సంబంధించిన సందేహాల గురించి మాట్లాడారు. రైతులు పండించిన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లలో ఎలా విక్రయించాలో, పసుపు పంటకు సంబంధించి అధిక దిగుబడి ఎలా పొందాలి? ఎక్కడెక్కడ పసుపు పంటకు సంబంధించిన స్పైసెస్‌ బోర్డులున్నాయి? అనే విషయాలను రైతులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పసుపు పంటను రోగాల బారి నుంచి ఎలా సంరక్షించుకోవాలో తెలిపారు. ఇప్పటికీ పసుపు పంట ద్వారా లాభాలు పొందిన కొద్ది మంది రైతుల గురించి తెలిపారు. సీడ్‌టెస్ట్‌ ఎలా చేయించుకోవాలో, క్వాలిటీ ఉందా? లేదా? అనేది ఎలా తెలుసుకోవాలి? పాలిషర్‌, ఉడకబెట్టే యంత్రాలను ఎలా వాడాలో వివరించారు. రైతులకు సంబంధించిన సబ్సిడీల గురించి సవివరంగా తెలియజేశారు. పసుపు నుంచి ఎలాంటి వస్తువులు తయారు చేస్తారో, ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిపారు. ఆరు స్టేజీల్లో పసుపు నుంచి పౌడర్‌ దశకు వచ్చే విధానాలను చూపించారు. ఏదో చేస్తారనే ఆశతో అక్కడికొచ్చిన రైతులకు ఇవన్నీ చూసి దిమ్మదిరిగిపోయింది. పిల్లలకు పాఠాలు చెబుతున్న రీతిలో పసుపు సాగుపై రైతులకు వివరించడంతో అంతా నోరెళ్లబెట్టారు. మద్దతు ధర లేక నష్టపోతున్నామని మొత్తుకుంటుంటే తాపీగా బోర్డుపై పాఠాలు చెబుతున్నారేంటని విస్తుపోయారు. స్పైసెస్‌బోర్డు ద్వారా పసుపు మాత్రమే కాకుండా మిర్చి, కొత్తిమీర, అల్లం వీటికి సంబంధించిన కూడా  ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించేందుకు ఈ బోర్డు సహాయ పడుతుందని చెప్పారు. అంటే.. పసుపు రైతులకు మేలు చేయండి.. అంటే సుగంధ ద్రవ్యాలన్నింటికీ మేలు చేస్తామంటూ వారి వైఖరి చెప్పడంతో అసలు లోగుట్టు అర్థమయ్యింది రైతులకు.

నమ్మితే నట్టేట ముంచారు.. 

ఈ కార్యక్రమంపై పసుపు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పసుపు రైతుకు కావలసింది శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కాదని, ముందుగా పసుపునకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పసుపు పండించడం రైతులకు తెలుసని.. ఏ పసుపు మేలైనదో వాటిని ఎలా మార్కెటింగ్‌ చేయాలో రైతులకు అవగాహన ఉందని పలువురు రైతులు పేర్కొన్నారు. పసుపు రైతులకు అవగాహన సదస్సు అని సమావేశానికి పిలిస్తే పసుపునకు మద్దతు ధర తెలియ జేస్తారని ఆశతో సమావేశానికి వచ్చాం, కానీ తీరా ఇక్కడ మాకు కావలసిన విషయాలు ఏమీ తెలియ పరచలేదని రైతులు భగ్గుమన్నారు. రైతులు లక్షల రూపాయలు వెచ్చించి పసుపు పండిస్తుంటే మద్దతు ధర మాత్రం నిరాశజనకంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేనిది అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు వృథా అని సమావేశాన్ని బహిష్కరించారు. నమ్మితే నట్టేటా ముంచారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్పైసెస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు చాలా సమయం పడుతుందని.. అంతవరకు రైతులు నష్ట పోకుండా ఉండడానికి ముందుగా మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 


logo