బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 13, 2020 , 01:03:13

సామాన్యులపై పెనుభారం...!

సామాన్యులపై పెనుభారం...!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :   పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్రభావం చూపే వంటగ్యాస్‌ ధరలను చీటికి మాటికి పెంచ డంతో కేంద్ర సర్కారు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో జనం ఇప్పటికే సతమతం అవుతుండ గా  ఏకంగా రూ.145 పెంచడం మరింత కుంగదీస్తున్నది. మన దేశంలో వంటిల్లు భారం మోస్తున్న దీ మహిళలే. వంటగ్యాస్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచడం ద్వారా పేద కుటుంబాలకు అది పెను భారం అవుతున్నది. పర్యవసానంగా ఆ కుటుంబా లు తిరిగి పాత పద్ధతుల్లో పొయ్యి రాజేసుకునే అవకాశాలే ఎక్కువగా దాపురిస్తున్నాయి. కట్టెల పొయ్యిపై వంట చేస్తే వచ్చే పొగతో మహిళ లు కంటి సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమా దం ఉంటుంది. వంట చెరుకు కోసం చెట్ల నరికివేత కారణంగా అటవీ విస్తీర్ణం అంతరించి మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వాలు వంట గ్యాస్‌ వినియోగాన్ని పెంచే అంశానికి ప్రాధాన్యం ఇచ్చాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, మహిళా సం ఘాల్లోని సభ్యులకు రాయితీపై కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని సైతం అమలు చేశాయి. ఇంత వరకు బా గానే ఉన్నా ప్రస్తుతం సిలిండర్ల రీఫిల్లింగ్‌కు ఇస్తున్న రా యితీని తగ్గించడం, ఎల్పీజీ ధరలను పెంచడం మూలంగా సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.

ఇప్పటికే రాయితీకి మంగళం...

ఇప్పటికే వంట గ్యాస్‌పై రాయితీని క్రమంగా ఎత్తివేతకు శ్రీకారం చుట్టిన ఎన్డీయే సర్కారు ప్రస్తుతం ప్రతీ సిలిండర్‌కు కేవలం రూ.178 మాత్రమే సబ్సిడీ అందిస్తున్నది. నామమాత్రంగానే రాయితీ అందుతున్న వేళ మరింతగా ధరలు పెంచడం అన్నదీ పులి మీద పుట్రలా తయారైంది. వంటగ్యాస్‌ సిలిండర్లపై రాయితీకి భారీగా మంగళం పాడిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు... ఎడాపెడా వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. పెట్రోల్‌పైనా, డీజిల్‌ పైనా ధరల నియంత్రణ వ్యవస్థను ఎత్తేసినట్లే వంటగ్యాస్‌పై కూడా తొలగించడంతో ధరల మార్పులు ఇష్టానుసారంగా తయారైంది. ఒక్కసారిగా ధర పెంచితే జనంలో ఎలాంటి స్పందన వస్తుందో అన్న ఆలోచనతో దొడ్డిదారిలో మోదీ సర్కారు మొన్నటి వరకూ రాయితీపై కోతలు విధిస్తూ వచ్చారు. దీం తో వంట గ్యాస్‌పై రాయితీ ఎత్తివేత నిర్ణయంతో సామాన్య పేద కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. ఓ పక్క పేద కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తూనే మరో పక్కా రాయితీలు ఎత్తివేయడం ఏమిటని కేంద్రాన్ని ప్రజలు ప్రశ్నించగా ఇప్పుడేకంగా ధరల పెంపు ఆందోళనకు గురి చేస్తున్నది. 

ప్రతీ సిలిండర్‌పై రూ.145 పెంపు...

వంట గ్యాస్‌ ధర ఒకే సారి రూ.145 పెరిగింది. ఫలితంగా రూ.714 ఉన్నటువంటి ఒక్క ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర అమాంతం రూ.858కు చే రింది. అయితే కేంద్రం ఇచ్చే రాయితీని కూడా పెంచుతున్నట్లుగా చెబుతున్నప్పటికీ అదీ అమలయ్యేది సందేహంగానే ఉంది. 2014 జనవరి త ర్వాత వంట గ్యాస్‌ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మార్పే తాజా ధరల పెంపునకు కారణమని ప్రభు త్వం చెబుతున్నప్పటికీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల అ నంతరమే దేశ ప్రజలపై మోడీ సర్కారు ఈ నిర్ణ యం తీసుకోవడం ఆలోచింపజేస్తున్నది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున ధరల్ని సమీక్షిస్తుంటారు. కానీ, ఈ సారి దాదాపు రెండు వారా లు ఆలస్యమైంది. రాయితీని భారీగా పెంచుతున్న కారణంగా అనుమతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నప్పటికీ ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ధరల పెంపును వాయిదా వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన ఐదు నెలల్లో  సిలిండర్‌ ధరలను పెంచడం వరుస గా ఇదీ ఆరోసారి కావడం విశేషం.  జిల్లాలో సుమారుగా 2లక్షలకు పైగా ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. వీరందరికీ పెరిగిన ఎల్పీజీ గ్యాస్‌ సి లిండర్ల ధరల పెంపు గుదిబండలా మారబోతున్నది.


logo