గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 13, 2020 , 01:01:06

సమ్మేళనానికి సన్నాహలు

సమ్మేళనానికి సన్నాహలు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: క్షేత్రస్థాయిలో గ్రామాలను బలోపేతం చేసేందుకు కొత్తగా పంచాయతీరాజ్‌ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే క్రమంలో స్థానిక సంస్థల ప్రతినిధుల బాధ్యతలు,  కర్తవ్యం గురించి సవివరంగా తెలియజేసి పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వారిని కార్యోన్ముఖులను చేసే క్రమంలో ప్రభుత్వం త్వరలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం పేరుతో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సమావేశాలకు మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రభు త్వం బుధవారం విడుదల చేసిన ఓ ఉత్తర్వులో పేర్కొంది. మంత్రితో పాటు జడ్పీచైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎం పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల విధులను విడమరిచి వివరించడంతో పాటు పల్లెలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి పథంలో నడిపేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధుల పై మంత్రి వివరిస్తారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహించే పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సమావేశం తర్వాత పది రోజుల గడువిచ్చి గ్రామ పరిస్థితుల పురోగతి పై అధ్యయనం చేస్తారు. దీనిపై ప్రభుత్వం ఫ్లయింగ్‌ స్కాడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నది. తానే స్వయంగా పల్లెలకు వచ్చి పురోగతిని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి పరిశీలించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏ గ్రామ పురోగతి సరిగ్గా లేకున్న తగిన చర్యలుంటాయని సీఎం హెచ్చరించిన విషయం  తెలిసిందే. అలాగే గ్రామాలను బాగు చేసుకున్న వారికి అవార్డులు, ప్రోత్సహకాలు కూడా ఉంటాయని ప్రకటించారు. మరో పది రోజుల్లో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉంది. త్వరలో ఈ తేదీ పై స్పష్టత రానున్నది. 



logo