గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 13, 2020 , 00:58:01

సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి

 సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి

 కోటగిరి : రైతులు పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్లను నివారించవచ్చని రుద్రూర్‌ వరి చెరకు పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ జలంధర్‌నాయక్‌, డాక్టర్‌ స్వాతి, రమ్య రాథోడ్‌ అన్నారు. శాస్త్రవేత్తల బృందం బుధవారం మండలంలోని శేషాద్రిఫారం, కొల్లూర్‌ గ్రామాల్లో  వరి పంటను క్షేత్రస్థాయిలో సందర్శించారు. వరి పంటలో కాండం కుళ్లు తెగులు ఉధృతి ఉన్నట్లు గుర్తించారు. నివారణకు హెక్సాకొనజోల్‌ 2, ఎంఎల్‌, ప్రాపికొనజోల్‌ ఎంఎల్‌, వాలిడామైసిన్‌ 2, ఎంఎల్‌, కార్బండిజమ్‌ ఒక గ్రాము, టెబ్యుకొనజోల్‌ ఒక ఎంఎల్‌ నీటిలో కలిపి మొదళ్లు బాగా తడిచేలా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. వారి వెంట రైతులు ఉన్నారు.

  భూసార పరీక్ష తప్పని సరి..

 రైతులు పంట సాగు చేసే ముందు కచ్చితంగా భూసార పరీక్ష చేయించుకోవాలని ఏఈవో కావేరి అన్నారు. బుధవారం సుద్దులం సమీపంలోని ఫకీరాబాద్‌ శివారులో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌లో భాగంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. పంట సాగు చేసే ముందు భూసార పరీక్ష చేయించుకుంటే ఏ రకమైన ఎరువులు వాడాలనేది తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో రైతులు ఉన్నారు.

పొటాష్‌తో రోగనిరోధక శక్తి పెరుగుదల

రుద్రూర్‌: వరి పైరులో రోగనిరోధక శక్తిని పెంచేందుకు పొటాష్‌ దోహదపడుతుందని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అన్నారు. వరి, చెరుకు పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్‌ శ్రీధర్‌ శాస్త్రవేత్తల బృందంతో కలిసి అక్బర్‌నగర్‌, వర్ని శివారులో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంట పైరుపై అగ్గితెగులు ఆశిస్తున్నదన్నారు. దీని నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. తెగులు నివారణకు ట్రైసైక్లొజోల్‌, మ్యాంకోజెట్‌ 2.5 లీటరు నీటికి లేదా కానుగామైసిన్‌ 2.5 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు వీలుగా  పొటాష్‌ ఎరువును మ్యారెట్‌ ఆఫ్‌ పొటాష్‌ రూపంలో ఎకరానికి  10-15 కిలోలు రెండు దఫాలు వేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు జలంధర్‌ నాయక్‌, స్వాతి, రమ్యరాథోడ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.


logo