శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 12, 2020 , 00:32:03

ప్రచార సందడి..

ప్రచార సందడి..

నిజాంసాగర్‌ రూరల్‌ : సహకార సంఘాల ఎన్నికల  పర్వంలో జిల్లాలో 713 ప్రాదేశిక స్థానాలకు 363 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 350 స్థానాల్లో 834 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించడంతో మంగళవా రం ఆయా అభ్యర్థులు వారి వారి పరిధిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలో మెజార్టీ స్థానాలను ఇప్పటికే ఏకగ్రీవాల రూపంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది.  

ఊపందుకున్న ప్రచారం

జిల్లాలో 55 సహకార సంఘాల్లో 12 సంఘాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 43 సంఘాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నా రు. వారికి కేటాయించిన గుర్తులను ఓటర్లకు చూయిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. 43 సంఘాల్లో సైతం చాలా వాటిలో మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. మిగిలి ఉన్న స్థానాల్లో  ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా సహకార సంఘం అధ్యక్ష పదవి టీఆర్‌ఎస్‌కు దక్కేలా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో పాటు మండల స్థాయిలో మండల నాయకులు, ఎత్తులు వేస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌దే హవా

సహకార సంఘాల ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగుతున్నది.  ఇప్పటికే ఏకగ్రీవమైన 363 ప్రాదేశిక స్థానాల్లోనూ, 12 సంఘాల్లో టీఆర్‌ఎస్‌దే హవా కొనసాగింది. ఇదే ఊపుతో మిగిలి ఉన్న 350 స్థానాలలోను విజయం సాధించి 43 సంఘాలతో పాటు జిల్లా డీసీసీబీలో గులాబీ జెండా ఎగురవేసే దిశగా ముందుకు సాగుతున్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు సైతం తమ మద్దతుదారులను బరిలో నిలిపాయి. సహకార సంఘ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.logo