సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 12, 2020 , 00:34:47

చెట్లతోనే మనిషి మనుగడ

చెట్లతోనే మనిషి మనుగడ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : మనిషి మనుగడకు చెట్లే ఆధారమని, భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్పీ కార్యాలయం ఎదురుగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో హరిత రక్షక వనంలో మంగళవారం ఆయన మొక్కలు నాటారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 6ఎకరాల్లో హరిత రక్షక వనం ఏర్పాటు చేయడంపై ఎస్పీ శ్వేతారెడ్డిని స్పీకర్‌ అభినందించారు.  చెట్లు ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని గాంధారి, మంచిప్ప, బాన్సువాడ ప్రాంతాల్లో ప్రతి ఏడాది అధిక వర్షపాతం నమోదయ్యేదని, భిక్కనూర్‌, దోమకొండ, మాచారెడ్డి మండలాల్లో చెట్లు ఎక్కువ లేకపోవడంతో తక్కువ వర్షపాతం నమోదు అయ్యేదని చెప్పారు.  చెట్లు పెంచడంతో పర్యావరణ పరిరక్షణకు దోహదం ఏర్పడుతుందన్నారు. మొక్కలను విస్తృతంగా నాటి ఎక్కువ వర్షపాతం నమోదుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 3500 మొక్కలతో పోలీసు శాఖ హరిత రక్షక వనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పర్యావరణం, పచ్చదనాన్ని కాపాడకపోతే జలప్రళయం వస్తుందన్నారు.  సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో హరితహారంలో  భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటేందుకు ప్రణాళిక చేశారన్నారు. సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీరు రావడానికి మంజీరా పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ ద్వారా నీటిని తేవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. పర్యావరణ శాస్త్రవేత్తల సూచన మేరకు 15మొక్కలు ఉంటేనే ప్రతి వ్యక్తికి ఆక్సిజన్‌ అందుతుందన్నారు. జిల్లాలో అందుకు అనుగుణంగా మొక్కలను నాటాలన్నారు.  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి  వాటిని రక్షించాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ బర్త్‌డేకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. 

హరిత కామారెడ్డిగా మార్చాలి 

కామారెడ్డి మున్సిపాలిటీని హరిత కామారెడ్డిగా మార్చాలని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవికి స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. విద్యావంతురాలైనా చైర్‌పర్సన్‌ పట్టుదలతో కామారెడ్డి మున్సిపాలిటీని హరిత వనంగా తీర్చిదిద్దాలన్నారు. చైర్మన్‌ పదవి రావడం జాహ్నవి అదృష్టమని, తండ్రి నిట్టు వేణుగోపాల్‌ రావుకు రాని పదవి కూతురును వరించిందన్నారు. 

ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో హరిత రక్షక వనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించి జీవన ప్రమాణాలు పెంచేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రజల రక్షణతో పాటు వన రక్షణ చేపట్టిన పోలీసు శాఖను విప్‌ అభినందించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని ఆదర్శంగా నిలవాలని అన్నారు. అనంతరం పోలీసు వనంలో ఏర్పాటు చేసిన ఫిష్‌ పాండ్‌ను స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, విప్‌ గంపగోవర్ధన్‌, అధికారులు సందర్శించారు. పోలీసు రక్షక వనం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజాస్‌నందలాల్‌ పవార్‌, అడిషనల్‌ ఎస్పీ అనోన్య, జడ్పీ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఇందుప్రియ, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, కామారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోపీగౌడ్‌, కౌన్సిలర్‌ రాణి, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo