మంగళవారం 07 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 11, 2020 , 01:41:42

ఒకే మాట... ఒకే బాట..!

ఒకే మాట... ఒకే బాట..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రస్తుతం 55 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ప్రతి సంఘానికి 13 చొప్పున ప్రాదేశిక స్థానాలను వర్గీకరించగా వీటికి సభ్యులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. జిల్లాలో 53 సంఘాల్లో 13 టీసీలుంటే 2 సొసైటీల్లో మాత్రం 12 టీసీలున్నాయి. దామరంచ సొసైటీ, పద్మాజివాడి సొసైటీలో 12 వార్డులే ఉన్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం పూర్తవ్వడంతో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. 713 టీసీల్లో ఇప్పటికే 178 స్థానాల్లో ఒకే నామినేషన్‌ వేశారు. పరిశీలన, ఉపసంహరణలో చాలా మంది పోటీకి దూరం అవ్వడంతో అత్యధిక స్థానాలు సోమవారానికి ఏకగ్రీవాలయ్యాయి. చాలా సంఘాల పరిధిలో నామినేషన్లకు ముందుగానే ఆయా వార్డుల్లోని   మంతనాలు సాగించి నామినేషన్లు దాఖలు చేయకుండానే తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కొన్ని చోట్ల నామినేషన్లు భారీగానే పడినప్పటికీ నేతలు రంగంలోకి దిగి పెద్ద సంఖ్యలో ఉపసంహరణకు కృషి చేయించి సఫలం అయ్యారు. సహకార ఎన్నికలు పార్టీ రహితం కావడంతో సంఘాల పాలక మండళ్లను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటాపోటీగానే తమ మద్ధతు దారులను బరిలో దింపుతున్నది. ఇందులో అత్యధికులు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే పోలింగ్‌ లేకుండా ఏకగ్రీవాలతో దూసుకపోతున్నారు.

పదవులపై గురి...

సహకార సంఘాల్లో 13 స్థానాలుంటాయి. వీటిలో ఆరు స్థానాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మిగిలిన 7 స్థానాలు జనరల్‌ కోటాలోనే ఉన్నాయి. రిజర్వేషన్‌ కోటాలో ఆయా కేటాయింపులు అభ్యర్థులు పోటీ పడుతుండగా జనరల్‌ స్థానాల్లో అన్ని వర్గాల అభ్యర్థులు భారీగానే నామినేషన్లు వేసి వెనుకడుగు వేశారు. పైగా సంఘాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులకు ఎలాంటి రిజర్వేషన్‌ లేకపోవడం ఇటీవల వరుస ఎన్నికల్లో ఏ పదవులు దక్కని వారికి వరంగా మారింది. దీంతో తమ వార్డుల్లో  ఎన్నికల వరకు వెళ్లకుండానే నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు జోరుగా చేసి విజయం సాధించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులను ఆశిస్తున్న వారు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రాష్ట్ర స్థాయి పదవులను కోరుకుంటున్న వారు పూర్తిగా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు. తాము పాలక మండలి సభ్యులుగా, ఇతరత్రా పదవులను పొందితే స్థానిక సంఘాల అభివృద్ధి, అన్నదాతల సేవలపై హామీలిస్తూ నామినేషన్లు ఎక్కువగా వేయకుండా పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తాము ఏకగ్రీవంగా ఎన్నికైతే సంఘం పరిధిలోని మిగిలిన వార్డుల్లో ప్రచారం చేయడం, ప్యానల్‌ అభ్యర్థులను గెలిపించుకుని సొసైటీ పగ్గాలను అందుకోవడంపై నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు.


logo