సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 11, 2020 , 01:39:49

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : సమస్యల సత్వర పరిష్కారం కోసమే డివిజన్‌ కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ అన్నారు. బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో డివిజన్‌ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని తొలిసారిగా సోమవారం నిర్వహించారు. నస్రుల్లాబాద్‌ మండలంలోని తేజ స్వామి అనే వ్యక్తి కంటి వెలుగు కార్యక్రమానికి తన వాహనాన్ని 5 నెలలు నడిపించాడు. ఇందుకు సంబంధించిన బిల్లు చెల్లించాలని ఎంతో కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, తనకు డబ్బులు అందేలా చూడాలని ఫిర్యాదు చేశాడు. సంబంధిత శాఖ అధికారి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సోమవారంలోగా బాధితుడికి బిల్లు చెల్లించాలని ఆదేశించారు. 

బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో 20 ఏళ్లుగా ఉన్న పశు వధశాల ఉందని, పశువులను వధించిన సమయంలో మురికి కాలువల్లో రక్తం ప్రవహించి, దోమలు, ఈగలు వాలి కాలనీ వాసులు వ్యాధుల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 23 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రజల నుంచి కలెక్టర్‌ ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులతో వారి ముందే మాట్లాడారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ఒకసారి ఫిర్యాదు చేయగానే సమస్య పరిష్కారం కావాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న ఫిర్యాదుపై పది రోజుల్లో ఎంక్వైరీ పూర్తిచేయాలన్నారు. నెలల పాటు ఎంక్వైరీ చేస్తే సంబంధిత తహసీల్దార్‌పై చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్డీవో చంద్రమోహన్‌ రెడ్డి, ఆర్దీవో రాజేశ్వర్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శేషారావు, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీ అనురాధ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ అధికారి బాలయ్య, మత్య్సశాఖ, అటవీ శాఖ అధికారులు పూర్ణిమ, వసంత, తహసీల్దార్‌ గంగాధర్‌, డీటీవో అంబాజీరావు, డీఈవో రాజు పాల్గొన్నారు. 


logo