శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 11, 2020 , 01:31:21

రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ

రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ

ఎల్లారెడ్డి రూరల్‌ : వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని హాజీపూర్‌ గ్రామస్తులతో ఆమె సోమవారం మాట్లాడారు. వాహనాలను అతివేగంగా నడపవద్దన్నారు. హెల్మెట్‌ లేని ప్రయాణం ప్రాణాంతకమన్నారు. పిల్లలను ఆరుబయట, రోడ్డుకు సమీపంలో ఆడుకోనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్టేట్‌ హైవే పరిధిలోని కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వరకు గల రోడ్డును పరిశీలించామని తెలిపారు. రోడ్డు మూలమలుపుల వద్ద సూచికల బోర్డులు, ఇరుకు కల్వర్టుల వద్ద తగిన ఏర్పాట్లు, రోడ్డ్డు పక్కన ఉన్న పొదలను తొలగిస్తామని తెలిపారు. వీటిపై నివేదికలను తయారుచేసి కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో డీఎస్పీ శశాంక్‌రెడ్డి, ఎస్సై శ్వేత, పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డి - ఎల్లారెడ్డి రోడ్డు పరిశీలన..

లింగంపేట : మండల పరిధిలోని కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిని ఎస్పీ శ్వేతారెడ్డి సోమవారం పరిశీలించారు. కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై ఉన్న ఇరుకు వంతెనలు, ప్రమాదకర వంతెనలు, మూలమలుపులను పరిశీలించారు. ఇటీవల కాలంలో రోడ్డుపై జరిగిన ప్రమాద స్థలాలను పరిశీలించి, రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్‌అండ్‌బీ ఆధికారులతో చర్చించారు. ఎస్పీ వెంట ఎంపీపీ గరీబున్నీసా బేగం, ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌, ఎస్సై సుఖేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.


logo