శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 10, 2020 , 00:57:10

దాబాల్లో మద్యం దందా..!

దాబాల్లో మద్యం దందా..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో రెండు జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. 44, 161 జాతీయ రహదారులపై భారీగా దాబాలు వెలిశాయి. సుదూర ప్రాంతాలకు సరకులు రవాణా చేసే వారు, ప్రయాణాలు చేసే వారంతా దాబాల్లో సేద తీరి భోజనాలు ఆరగించి వెళ్లడం పరిపాటిగా నడుస్తున్నది. అయితే, కొంత మంది నిర్వాహకులు పోలీసులను మచ్చిక చేసుకుని దాబాలను బార్లుగా మార్చేస్తున్నారు. సాక్షాత్తు జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే దాబాలన్నీ బారుల్లా మారడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇంతలా పరిస్థితి దాపురించినప్పటికీ జిల్లా స్థాయి అధికారులకు సమాచారం చేరకపోవడమూ విడ్డూరంగానే ఉంది. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన కొంత మంది ఖాకీలు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారికంగా నిర్వహించే బారులు మాత్రం సమయానికి తెరుచుకుని, సమయానికి మూత పడుతుంటే జాతీయ రహదారులపై వెలసిన దాబాల్లో మాత్రం సమయపాలనే లేకపోవడం విశేషం. ఎప్పుడంటే అప్పుడే సిట్టింగ్‌లకు జాగాలు ఇచ్చి అక్రమ తంతుకు దాబాలను అడ్డాగా మారుస్తున్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు అన్నీ తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం డంప్‌ చేస్తున్నప్పటికీ ఆబ్కారీ శాఖ కనీసం తనిఖీలు చేయడం లేదు. విచ్చలవిడిగా దాబాలో దందా కొనసాగుతున్నా పోలీసులూ పట్టించుకోవడం లేదు.

ఠాణా పక్కనే తతంగం...

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొన్ని దాబాల్లో పరిస్థితిని గమనిస్తే బారులను మించిపోతున్నాయి. కేసుల కొద్దీ మద్యం బాటిళ్లు డంప్‌ చేసుకోవడం, అడిగిన వెంటనే ఎలాంటి బ్రాండ్‌ మద్యమైనా చిటికెలో అందిస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. దర్జాగా ఆర్డర్‌ టు సర్వ్‌ అన్న విధంగా నడుస్తున్న ఇక్కడి బాగోతానికి మామూళ్లే అసలు కారణంగా తెలుస్తున్నది. దాబా నిర్వాహకులతో కొంత మంది పోలీసులు లాలూచీ పడడమే అసలు కారణంగా తెలుస్తున్నది. భిక్కనూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దాబాల్లోనూ ఇదే దుస్థితి ఏర్పడింది. భిక్కనూర్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయానికి కిలో మీటర్‌ దూరంలోనే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఇక లింగంపేట ఠాణా వద్ద పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పోలీస్‌ స్టేషన్‌కు పక్కనే వెలసిన దాబాల్లో పట్టపగలు, రాత్రి తేడా లేకుండానే మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతుండడం విశేషం. ఇక జిల్లా సరిహద్దు మండలాలైన పిట్లం, మద్నూర్‌లో పోలీస్‌ అధికారుల కనుసన్నల్లోనే దాబాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తున్నది. ఈ మధ్యే పదోన్నతి పొందిన ఓ అధికారి ఏకంగా దాబా నిర్వాహకులకు మామూళ్ల టార్గెట్‌లు విధిస్తున్నట్లు సమాచారం. బాన్సువాడ పట్టణ శివారులోనూ ఇదే తంతు సాగుతున్నది. 

ఓ వైపు అవగాహన... మరోవైపు ఉల్లంఘన...

గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో 227 మంది మరణించినట్లుగా వెల్లడైంది. ఎస్పీ విశ్లేషణ మేరకు చాలా మంది మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం మూలంగానే ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా తేలింది. భారీగా ప్రాణ నష్టం సంభవించడాన్ని గమనించిన పోలీస్‌ అధికారులు... ఈ తీవ్రతను తగ్గించేందుకు నడుం బిగించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన సైతం కల్పించారు. రవాణా శాఖ, పోలీసులు సంయుక్తంగా డ్రైవ్‌ నిర్వహించి ప్రజలకు చైతన్యం కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పటిష్టవంతంగా చర్యలు తీసుకుంటున్న దరిమిలా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా మారడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఎస్పీ శ్వేతారెడ్డి స్వయంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాల నిర్వహిస్తుంటే ఆయా మండలాల్లో పోలీసులు మాత్రం దాబాల్లో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపి వాహనాదారుల ప్రమాదాలకు దారి చూపుతున్నారు.

చిత్తవుతున్న యువత...

దాబాల్లో మద్యం సేవించడానికి జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్న వారితో పాటుగా పట్టణ ప్రాంతాల నుంచి యువత పెద్ద ఎత్తున వస్తుండడం కనిపిస్తున్నది. అమ్మానాన్నలు, తెలిసిన వ్యక్తుల కంట పడకుండా ఉండేందుకు శివారు ప్రాంతాలను కాలేజీ కుర్రాళ్లు వెతుక్కుంటూ వస్తున్నారు. ఓ చేతిలో సిగరేటు, మరో చేతిలో మద్యం బాటిళ్లు పట్టుకుని జల్సా చేస్తున్నారు. తప్పతాగి వాహనాలతో రోడ్డెక్కి విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రమాదాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అభినందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో దాబాల్లో కొనసాగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకోకపోవడంపై విమర్శిస్తున్నారు. ఈ కోవలో పోలీసులు ఇప్పటికైనా స్పందిస్తే ప్రమాదాల నివారణ మార్గంలో మంచి ఫలితాలుంటాయని ప్రజలంతా కోరుకుంటున్నారు.


logo