మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 10, 2020 , 00:53:40

ప్రభుత్వ విప్‌గా గంప గోవర్ధన్‌ బాధ్యతల స్వీకరణ

ప్రభుత్వ విప్‌గా గంప గోవర్ధన్‌ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో సీనియర్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రభుత్వ విప్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి, ఎంపీ పాటిల్‌, జిల్లా నేతలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలు తెలంగాణకు దక్కగా వాటిలోనే ప్రభుత్వ విప్‌లకు చాంబర్‌లను కేటాయించారు. తనకు కేటాయించిన చాంబర్‌లో ఉదయం పదిన్నర గంటలకు శాస్ర్తోక్తకంగా పూజలు నిర్వహించిన కామారెడ్డి ఎమ్మెల్యే అనంతరం బాధ్యతలు స్వీకరించారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ పాటిల్‌, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌తో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులంతా గంప గోవర్ధన్‌ను అభినందించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్లడంతో అసెంబ్లీ ప్రాంగణంలో సందడిగా మారింది. గులాబీ నేతలు, ప్రజాప్రతినిధుల కోలాహలం మధ్య విప్‌ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సాగింది.

అభినందనల వెల్లువ...

గంప గోవర్దన్‌ 1987లో బస్వాపూర్‌ సింగిల్‌ విండో ఛైర్మన్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. భిక్కనూర్‌ మండలం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారిగా 1994లో టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999లో టికెట్టు దక్కలేదు. 1999 నుంచి 2000 సంవత్సరం వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే రెండేండ్ల పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి చేపట్టారు. 2004లో కామారెడ్డి స్థానంలో పోటీ చేయాలని భావించగా.. పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో ఎల్లారెడ్డి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి షబ్బీర్‌ అలీపై గెలుపొందారు. 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయ దుందుభి మోగించారు. 2014లో మరోసారి విజయం సాధించిన ఆయన అసెంబ్లీ రద్దు అయ్యేంత వరకు ప్రభుత్వ విప్‌గా పని చేశారు. అనంతరం 2019లోనూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీని మట్టికరిపించి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ విప్‌గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన గంప గోవర్ధన్‌కు కామారెడ్డి జిల్లాకు చెందిన నేతలు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు.

శాసనసభలో ఆ నలుగురు...

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంటులున్నాయి. ఉమ్మడి జిల్లా మొదట్నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తున్నది. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తర్వాత గంప గోవర్ధన్‌ సీనియర్‌ ఎమ్మెల్యే. కామారెడ్డి నియోజకవర్గం నుంచి గంప గోవర్ధన్‌ మొత్తం ఆరు సార్లు పోటీ చేయగా ఐదు సార్లు విజయం సాధించారు. 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధిస్తూ చరిత్ర సృష్టించారు. కేసీఆర్‌ సారథ్యంలో రెండోసారి ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ గంప గోవర్ధన్‌కు వరుసగా రెండోసారి ప్రభుత్వ విప్‌ పదవి దక్కింది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రస్తుతం శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శాసనసభాపతిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ప్యానల్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇలా శాసనసభా వ్యవహారాలకు సంబంధించిన నాలుగు పదవుల్లోనూ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


logo
>>>>>>