ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Feb 09, 2020 , 00:25:15

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాలకు ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో సం దడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి నామినేషన్ల ఘట్టం ముగిసేంత వరకూ ఉత్కంఠ భరిత వాతావరణం ఏర్పడింది. ఇది వరకే రిజర్వేషన్లను ప్రకటించడంతో ఆశావహులంతా తమకు అనుకూలించే టెరిటోరియల్‌ కాన్‌స్టిట్యూషన్‌ పరిధిలో పోటీకి సిద్ధమయ్యారు.

ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీల పెద్ద ల ఆశీస్సులతో పీఏసీఎస్‌ బరిలో నిలిచారు. ఓటర్ల జాబితాను ఆయా సంఘాల్లో ఇప్పటికే ప్రదర్శించడంతో వారందరినీ మచ్చిక చేసుకునేందుకు బరి లో నిలిచిన వారంతా ప్రయత్నాలు ముమ్మరం చే స్తున్నారు. సహకార ఎన్నికల రణరంగం గ్రామాల్లో వేడిని పుట్టిస్తుండగా ఈ నెల 15న జరిగే పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జిల్లా సహకార అధికారి(డీసీవో) మమతతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి...

నమస్తే : జిల్లాలో సహకార ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అయ్యారు? జిల్లాలో పీఏసీఎస్‌ సభ్యులు, ఓటర్ల వివరాలేమిటి?

డీసీవో:  జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 55 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. 715 ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. దామరంచ, పద్మాజివాడి పీఏసీఎస్‌లలో ఎస్టీ ఓటర్లు లేనందున ఈ రెండు పీఏసీఎస్‌ పరిధి లో 12 ప్రాదేశిక నియోజకవర్గాలకే ఎన్నికలుంటా యి. ఈ విధంగా మొత్తం 713 ప్రాదేశిక నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఆయా సంఘాల పరిధిలో లక్షా 39వేల 589  మంది స భ్యులున్నారు. జిల్లా వ్యాప్తంగా 91,288 మంది అన్నదాతలకు ఓటు హక్కు ఉంది. 

15వ తారీఖున జరిగే ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఏ రకంగా ఉండబోతున్నది ?

సహకార ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తాం. ఫిబ్రవరి 15న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఎన్నిక ల ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత భోజన విరా మం అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతాం. లెక్కిం పు పూర్తయిన తర్వాత రిటర్నింగ్‌ అధికారులే గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. పటిష్టవంతంగా ఎన్నికలను నిర్వహించడానికి ఎలాంటి అక్రమాలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోబోతున్నాం.


logo