బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 08, 2020 , 00:28:04

ప్రేమకు చిహ్నం మినీ తాజ్‌మహల్‌

ప్రేమకు చిహ్నం మినీ తాజ్‌మహల్‌

మాచారెడ్డి : ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్న మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట్‌లోని మినీ తాజ్‌మహల్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కట్టడానికి ఘనమైన చరిత్ర ఉంది. 400 ఏండ్ల క్రితం మినీ తాజ్‌మహల్‌ను నిర్మించారు. షాజహాన్‌ తన ప్రేమకు ప్రతిరూపంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను నిర్మిస్తే నిజాం వంశస్తుడు ఫరీద్‌మియా ఇక్కడ మినీ తాజ్‌మహల్‌ను నిర్మించాడు. నిజాం నవాబ్‌కు సామంతుడైన ఫరీద్‌మియా తన భార్యను ఎంతో ప్రేమించేవాడు. ఆమె అకాల మరణం చెందడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ జ్ఞాపకాల నుంచి బయట పడని ఫరీద్‌మియా  తన ప్రేమకు ప్రతిరూపంగా అపురూపమైన సమాధి నిర్మించాడు. సమాధి ఉన్నచోటుని అచ్చం తాజ్‌మహల్‌ లాగే తీర్చిదిద్దాలని సంకల్పించాడు. కానీ ఆ కట్టడం పూర్తికాక ముందే ఆయన కూడా చనిపోయారు.దీంతో మినార్‌లను నిర్మించలేకపోయారని అయితే తాను చనిపోతే తన సమాధి కూడా భార్యపక్కనే ఏర్పాటు చేయాలని చెప్పడంతో అలాగే  ఏర్పాటు చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. 

శిథిలావస్థలో కోట

మినీతాజ్‌మహల్‌తో పాటు  ఇక్కడ ఉన్న కోటను గోల్కొండ సుల్తానుల కాలంలో నిర్మించారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కోట, మసీదు (మినీ తాజ్‌మహల్‌)లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి.  కోటలో నిజాం నవాబులు గుర్రాలను పెంచే వారని మినీ తాజ్‌మహల్‌ నుంచి దోమకొండ, గంభీరావుపేట సంస్థానాలకు సొరంగమార్గాలు ఉండేవని పెద్దలు చెబుతారు. కొంతమంది దుండగులు గుప్తనిధుల కోసం తవ్వడంతో సొరంగ మార్గం ధ్వంసమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. భార్యాభర్తల ప్రేమకు చిహ్నంగా నిలుస్తున్న ఈ మినీ తాజ్‌మహల్‌తో పాటు గడికోటను ప్రభుత్వం అధునీకరిస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఘనంగా మొహర్రం వేడుకలు

ఫరీదాబీ పేరిట మొహర్రం నాడు  హిందువులు, ముస్లింలు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఈ కట్టడాలు వక్ఫ్‌ బోర్డు  పరిధిలో ఉన్నప్పటికీ సంస్థానం పరిధిలో ఉన్న 460 ఎకరాల భూమి రాను రాను అన్యాక్రాంతమై కబ్జాలకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. వీటి ఆలన పాలన చూసేవారు లేకుండా పోయారు. 


logo