శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 08, 2020 , 00:22:18

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

 ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జనహిత హాలులో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ శరత్‌ కుమార్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ, విద్యుత్‌, పోస్టల్‌, రవాణా, వైద్య, విద్యాశాఖలు సంయుక్త కార్యాచరణ ప్రణాళికతో విధులు నిర్వహించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కృషిచేయాలన్నారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ చిత్ర రామచంద్రన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 65 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారి ద్వారా పాఠశాలలకు దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్‌, పరీక్షా కేంద్రాల రూట్‌ మ్యాప్‌, పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు, ఇన్విజిలేటర్లు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌, రూట్‌ ఆఫీసర్‌ నిర్వర్తిస్తున్న సిబ్బంది సమాచారాన్ని రోజూ వారీగా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ కమిషనర్‌కు సమర్పించాలని సూచించారు. పరీక్షా పత్రాలను పోస్టాఫీసు చీఫ్‌ సూపరింటెండెంట్‌ నుంచి ఉదయం 8.30 గంటలకు స్వీకరించాలన్నారు. పరీక్ష నిర్వహణకు 48 గంటల ముందు జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్షరోజు విద్యార్థులకు స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేసేలా టీఎస్‌ ఆర్టీసీ అధికారులు, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేలా విద్యుత్‌ శాఖ అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయం కోసం డీఎంహెచ్‌వో ద్వారా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు హై పవర్‌ కమిటీని, జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌ దోత్రె, జేసీ యాదిరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ అనోన్య, డీఐవో నాగరాజు, డీఈవో రాజు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


logo