గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 08, 2020 , 00:14:37

చల్లంగా చూసే నల్లగుట్ట నరసింహస్వామి

చల్లంగా చూసే నల్లగుట్ట నరసింహస్వామి

ధర్పల్లి : భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ ఆలయం. నల్ల రాతి కొండల్లో వెలసి నమ్మిన భక్తులను సల్లంగా చూసే నల్లగుట్ట నరసింహ స్వామి ఆలయం. మండలంలోని దుబ్బాక గ్రామ పరిధిలోని ధనంబండ దారికి పక్కన ఎత్తైన నల్ల రాతి కొండల్లో వెలసిన నృసింహస్వామి ఆలయ జాతర ఉత్సవాలను శనివారం నుంచి ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆలయ చరిత్ర..

మూడు దశాబ్దాల క్రితం దుబ్బాక గ్రామ పరిధిలోని నల్లరాతి కొండల్లో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రతి రూపంలో వెలిశానని ఓ బ్రాహ్మణుడికి కలలో కనిపించి చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్లి చూడగా.. మనుషులు దూరని రాతి గుహలో స్వామి వారి ప్రతిరూపం కనిపించిందని ఆలయ చరిత్ర చెబుతున్నది. దీంతో అప్పటి నుంచి  అక్కడే స్వామి వారిని నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఆలయంలో స్వామి వారి ని భక్తులు అత్యంత మహిమాన్వితుడిగా కొలుస్తారు. స్వామి వారిని నమ్మి కొలిస్తే తప్పకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని, కష్టాలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

మహిమాన్వితం.. కోనేటి నీరు..

నల్లగుట్లపై రాతితో నిర్మించిన కోనేటి నీరు ఎంతో మహిమాన్వితమైనదిగా, స్వామి వారి అనుగ్రహ జలంగా భక్తులు నమ్ముతారు. అన్ని కాలాల్లో నీరు పుష్కలంగా ఉంటుందని, నీరు ఎంతో తీయంగా ఉం టుందని, ఆ నీటిని తలపై చల్లుకోవడంతో ఇబ్బందు లు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కొండపై ఎప్పటికీ నీరు ఉండడం స్వామి వారి కృపనేనని భక్తులు అంటున్నారు.

మూడు రోజుల పాటు ఉత్సవాలు..

మూడు దశాబ్దాల చరిత్ర కలిగి ఎంతో మహిమాన్వితమైన ఆలయ ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యం లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సైతం ఘనంగా నిర్వహంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశా రు. శనివారం నుంచి సోమవారం వరకు ఆలయ జాతర ఉత్సవాలనను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శనివారం స్వామి వారు గుట్టపైకి వెళ్లడం, ఆదివారం పుణ్యహవచనం, కల్యాణ మహోత్సవం, అన్నదానం, సోమవారం స్వామి వారిని దుబ్బాక గ్రామం లో ఊరేగిస్తారు. ఈ జాతర ఉత్సవాలకు దుబ్బాక గ్రామంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాల సం దర్భంగా ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 


logo
>>>>>>