బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 07, 2020 , 01:17:32

కరోనా టెర్రర్‌

కరోనా టెర్రర్‌
  • మహమ్మారి వ్యాప్తిపై జిల్లా వాసుల్లోనూ ఆందోళన
  • చైనా పర్యటనలో ఉమ్మడి జిల్లా వాసులు
  • వ్యాపార, వాణిజ్య, విద్యా అవకాశాల కోసం పయనం
  • ఆందోళన చెందుతున్న స్థానికులు
  • తూర్పు ఆసియా దేశాలకు టూర్లు రద్దు చేసుకుంటున్న వైనం
  • జాగ్రత్తలు పాటించాలి: వైద్యారోగ్య శాఖ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పొరుగు దేశం చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వందలాది మందిని బలి తీసుకుంటున్నది. ఇప్పటికే పిట్టల్లా రాలిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన డ్రాగన్‌ దేశంలో ఈ వైరస్‌ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. వైరస్‌ సోకిన వారి సంఖ్య పెరుగుతున్నా కొద్దీ పొరుగు దేశాల్లో అప్రమత్తత పెరిగింది. మరోవైపు కరోనా వైరస్‌ లక్షణాలతో కూడిన వ్యక్తులు మన దేశంలోనూ బయటపడడం, అందులో హైదరాబాద్‌లోనూ అనుమానితులకు పరీక్షలు చేస్తుండడంతో జిల్లా వాసుల్లోనూ ఆందోళన పెరుగుతున్నది. వ్యాపార, వాణిజ్య, విద్యా అవకాశాల నిమిత్తం చైనాకు వెళ్లిన వారి పరిస్థితిపై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఉత్కంఠ నెలకొన్నది. కరోనా కల్లోలంతో చైనా నుంచి వచ్చిన వారంతా క్షుణ్ణంగా పరీక్షలు చేసుకున్నారో లేదో అనే ఆందోళన కూడా స్థానికులను వెంటాడుతున్నది. కరోనా వైరస్‌ మూలంగా చైనాకు భారీ నష్టమే సంభవిస్తుండగా డ్రాగన్‌ దేశంపై ఆధారపడిన జిల్లా వాసులు వ్యాపార పరంగా నష్టాలు మూటగట్టుకుంటుండడం గమనార్హం.


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ జిల్లా వాసులను కూడా వణికిస్తోంది. పలువురు ఉమ్మడి జిల్లా వాసులు చైనా పర్యటనలు చేస్తుంటారు. వ్యాపార, వాణిజ్య, విద్యావకాశాల కోసం చైనాకు వెళ్తుంటారు. అక్కడి నుంచి వచ్చిన వారి విషయంలో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్‌ సోకి మృత్యువాత పడుతుండడంతో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 


చైనా టూర్లు తగ్గుముఖం.. 

ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఓ ఫర్నిచర్‌ కంపెనీకి చెందిన ప్రతినిధులు వ్యాపార అవసరాల కోసం పది రోజులకోసారి చైనాకు వెళ్లి వస్తుంటారు. విభిన్నమైన మోడల్స్‌లో ఫర్నిచర్‌ ఐటమ్స్‌ను తీర్చిదిద్ది స్థానిక వినియోగదారులకు చేరవేసి లాభాలు గడించడం వారి పని. తక్కువ ధరకు, సులువుగా దొరికే ఫర్నిచర్‌ మోడళ్లను పసిగట్టి వాటి సాఫ్ట్‌వేర్‌ను దిగుమతి చేసుకునేందుకు జిల్లాకు చెందిన వ్యాపారులు నెలలో రెండు, మూడు సార్లు చైనా పర్యటనకు వెళ్లడం పరిపాటి. ఇలా ఓ ఫర్నిచర్‌ షాపు వారే కాకుండా అనేక మంది వ్యక్తులు తమ వ్యాపార, వాణిజ్య అవకాశాల కోసం ఆ దేశ పర్యటనకు వెళ్లి వస్తుండడం పెద్ద ఎత్తున సాగుతున్న తంతు. గడిచిన రెండు, మూడు వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలంగా జిల్లా నుంచి చైనాకు వెళ్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఫలితంగా డ్రాగన్‌ దేశంపై ఆధారపడి వ్యాపారాలు చేస్తున్న వారికి కరోనా వైరస్‌ ఓ రకంగా తీవ్ర నష్టాలనే మిగులుస్తున్నది. కరోనా విజృంభించడం మూలంగా ప్రపంచ దేశాలన్నీ చైనాకు విమానయానాన్ని రద్దు చేశాయి. అంతేగాక ఆ దేశంతో సముద్రపు జల రవాణాను నిషేధించాయి. అక్కడి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు వెనుకడుగు వేస్తుండడంతో చైనాపై ఆధారపడిన వ్యాపారాలన్నీ తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి.


అనుమానితులకు గాంధీలో చికిత్స.. 

వ్యాపారులే కాకుండా విద్యాభ్యాసం కోసం చైనాకు వెళ్లిన వారూ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో ఉండలేక, క్లిష్ట పరిస్థితుల్లో చదువుకోలేక ఇంటికి పయనం అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించేందుకు అనేక మంది చైనాకు వెళ్లారు. నాణ్యమైన విద్య పేరుతో కన్సల్టెన్సీల ఎరకు చిక్కిన వారంతా డ్రాగన్‌ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇంకొందరు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సులు చేయడానికి చైనాకు వెళ్లారు. ఇలా విద్యాభ్యాసం కోసం చైనాకు వెళ్లిన వారంతా కరోనా వైరస్‌ వ్యాప్తితో తిరుగు ప్రయాణం అయ్యారు. చైనా భూభాగంలో పెద్ద ఎత్తున వైరస్‌ వ్యాప్తి చెందడం, వేలాది మందికి కరోనా సోకడం వంటి కారణాలతో తల్లిదండ్రుల ఒత్తిడి, భారత ప్రభుత్వ చర్యల్లో భాగంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. చైనా నుంచి స్వదేశానికి వచ్చిన పౌరుల్లో జిల్లా వాసులు సైతం ఉండడం గమనార్హం. చైనా నుంచి వస్తున్న వారందరికీ విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన చర్యలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను గాంధీ దవాఖానకు తరలించి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేసి కరోనా వైరస్‌ జాడను పరిశీలిస్తున్నారు.


తూర్పు ఆసియా పర్యటనలు రద్దు.. 

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి అనేక మంది వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెందిన వారంతా ఆట విడుపుగా విదేశీ పర్యటనకు వెళ్తుండడం ఈ మధ్య తంతుగా మారింది. ఇందులో ప్రధానంగా చైనా, నేపాల్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, మయన్మార్‌, ఇండోనేషియా వంటి దేశాలను చుట్టేసి రావడం ఉమ్మడి జిల్లా ప్రజల్లో కొంత మందికి అలవాటే. పర్యాటక దేశంగా గుర్తింపు పొందిన థాయ్‌లాండ్‌ వంటి దేశానికి వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  కరోనా వైరస్‌ విజృంభన మూలంగా ఔత్సాహికులెంతో మంది తూర్పు ఆసియా దేశాల పర్యటనకు వెళ్లాలంటే జంకుతున్నారంటే అతిశయోక్తి కాదు. చైనాకు థాయ్‌లాండ్‌ సరిహద్దు దేశం కాకపోయినప్పటికీ డ్రాగన్‌ దేశంతో రాకపోకలు ఎక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తున్నది. కరోనా బీభత్సానికి చైనా నుంచి వ్యాపార అవకాశాలే కాకుండా విదేశీయానం దెబ్బతినే పరిస్థితికి చేరింది.


కరోనా అంటే..?

వైరస్‌ అనేది లాటిన్‌ పదం. వైద్య పరిభాషలో దీనికి విషం అని అర్థం ఉంది. వైరస్‌లు అతి సూక్ష్మజీవులు. వీటిని మామూలు కంటితో చూడలేం. శక్తివంతమైన మైక్రోస్కోపులతో మాత్రమే చూడగలం. ఇవి ఇతర జీవుల కణాలపై దాడి చేసి వ్యాధులకు కారణం అవుతాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశం తమ సంతతిని పెంచుకోవడమే. వైరస్‌లు విభజన చెందడం ద్వారా వాటి సంతతిని పెంచుకుంటాయి. ఇలా జరగాలంటే వాటికి జీవకణం తప్పనిసరి. అంటే ఇవి ఇతర జీవుల శరీరాల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే వాటి సంఖ్యను పెంచుకోగలవు. బ్యాక్టీరియాల కన్నా వైరస్‌లు అతి సూక్ష్మమైనవి. జీవుల్లో ఉండాల్సిన అతి ప్రాథమిక నిర్మాణమైన కణ నిర్మాణం వైరస్‌లకు లేదు. ఇతర జీవకణాలపై ఆధారపడకుండా వాటంతట అవి వృద్ధి చెందలేవు. ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టం బలహీన పడుతుందో అప్పుడు వైరస్‌లు విజృంభించి వేగంగా తమ సంతతిని పెంచుకుని దాడి చేస్తాయి. అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇవి ఎంత వేగంగా తమ సంఖ్యను పెంచుకుంటాయంటే చివరికి మనుషుల ప్రాణాలనే బలి తీసుకుంటాయి.


అప్రమత్తంగా ఉండాల్సిందే.. 

కరోనా వైరస్‌ కల్లోలంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం, తెలంగాణ సర్కారు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో 10 రోజుల క్రితమే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. విదేశాల నుంచి వస్తున్న వారిని ప్రవేశాల వద్దే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకవేళ అలాంటి వారికి అనుమానాలుంటే గాంధీ దవాఖానలో చికిత్స చేసుకోవచ్చు. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో ఈ వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చు. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం కాసింత ఊరటనిచ్చే అంశం. 30 డిగ్రీ నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వైరస్‌లు బతకలేవు. ప్రస్తుత పరిస్థితుల్లో షేక్‌ హ్యాండ్‌లు కాకుండా స్వచ్ఛ నమస్కారంతో ఎదుటి వారిని పలుకరించడం ఉత్తమం.

- చంద్రశేఖర్‌, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి


logo