ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Feb 07, 2020 , 01:16:18

ప్రతి ఇంటికీ ‘భగీరథ’ నీరు

ప్రతి ఇంటికీ ‘భగీరథ’ నీరు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జనహిత భవన్‌లో మిషన్‌ భగీరథ, వాటర్‌ గ్రిడ్‌పై అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నీటిని అందించడం కోసం ఇంటింటికీ నల్ల కనెక్షన్‌, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు, పైప్‌లైన్లను గ్రామాల వారీగా ఏర్పాటు చేసి సంబంధిత నివేదికలను ప్రతి వారం ఏఈ, డీఈ, ఎస్‌ఈలు సమర్పించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న 1464 కొత్త ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు బల్క్‌ వాటర్‌ సరఫరా చేసేందుకు మార్చి 31 వరకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. గ్రామంలో వేసిన అంతర్గత పైప్‌లైన్‌ పనుల్లో భాగంగా తవ్విన రీ స్టోరేషన్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని, పైప్‌లైన్లను పరీక్షించాలన్నారు.


పనులపై గ్రిడ్‌ అధికారులు ప్రతి వారం సమీక్షించాలని, పనులను వార్డు మెంబర్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పారు. మిషన్‌ భగీరథ అధికారులు 601 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల ఏర్పాటు కోసం స్థలాలు, వాటికి సరఫరా చేసే నీటి వివరాలతో మండలాలు, గ్రామాల వారీగా ఫిబ్రవరి 12వ తేదీ వరకు నివేదిక సమర్పించాలన్నారు. మద్నూర్‌ మండలంలో 39 నివాసిత ప్రదేశాల్లో, పిట్లంలో ఆరు, బిచ్కుందలో మూడు, జుక్కల్‌లో ఒక నివాసిత ప్రదేశంలో రీ స్టోరేషన్‌ పనులను వెంటనే చేపట్టాలని ఏఈలు, డీఈలను కలెక్టర్‌ ఆదేశించారు. ఎల్లారెడ్డిలో 21 నివాసిత ప్రదేశాల్లో ట్యాప్‌ వాటర్‌ వస్తున్నందున మిగతా పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఇంట్రా విలేజ్‌ పైప్‌లైన్‌ పెండింగ్‌ పనులపై నివేదిక అందించాలన్నారు. మిషన్‌ భగీరథ ఎస్‌ఈ రాజేంద్రకుమార్‌, కాంట్రాక్టర్‌ రాంచందర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ లక్ష్మీనారాయణ, వాటర్‌ గ్రిడ్‌ ఈఈ నరేశ్‌ పాల్గొన్నారు. 


క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్‌  

జిల్లా కేంద్రంలోని అడ్లూర్‌ శివారులో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ ఆవరణలో చేపడుతున్న కాంపౌండ్‌ వాల్‌, గేట్‌, అంతర్గత రోడ్డు పనులను  కలెక్టర్‌ శరత్‌ గురువారం పరిశీలించారు. క్యాంప్‌ కార్యాలయంలో పనులను ఫిబ్రవరి 16వ తేదీ వరకు పూర్తి అయ్యేలా చూడాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ అధికారులకు ఆయన ఆదేశించారు. నూతన కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో ఆడిటోరియం, వాహనాల పార్కింగ్‌, లాన్‌, వాకింగ్‌ట్రాక్‌ పనులను, ఫిల్లింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త కలెక్టరేట్‌లో పార్ట్‌ ఏ పనులను పూర్తి స్థాయిలో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌ దోత్రే, ప్రాజెక్టు మేనేజర్‌ ఆర్‌అండ్‌బీ జలగం శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ ఈఈ సిద్దిరాములు, డీఎఫ్‌వో వసంత పాల్గొన్నారు. logo