సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 06, 2020 , 01:02:38

అక్కడలేనిది ఇక్కడెలా?

అక్కడలేనిది ఇక్కడెలా?
  • కేరళలో పసుపునకు మద్దతు ధర ఎందుకు రావడం లేదు?
  • రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
  • జిల్లా రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు..
  • కేంద్రమే పసుపుబోర్డు ఇవ్వాలి
  • స్పైసెస్‌బోర్డు ఆఫీస్‌తో పసుపు రైతులకు ఒరిగేదేమీ లేదు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: స్పైస్‌బోర్డు ఆఫీస్‌ ఉన్న కేరళలో పసుపు రైతుకు దక్కని మద్దతు ధర నిజామాబాద్‌లో స్పైస్‌బోర్డు ఆఫీస్‌ పెట్టినంత మాత్రాన ఇక్కడి పసుపు రైతులకు ధర ఎలా వస్తుందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన భీమ్‌గల్‌లో మీడియాతో మాట్లాడారు. స్పైస్‌బోర్డు ఆఫీస్‌లు దేశంలో పదహారు చోట్ల ఉన్నాయన్నారు. ఈ ఆఫీసులు ఉన్న చోట్ల మద్దతు ధర రావడంలేదని గుర్తు చేశారు. వరంగల్‌లో దాదాపు 20 సంవత్సరాలుగా, సికింద్రాబాద్‌లో 30 సంవత్సరాలుగా స్పైస్‌బోర్డు ఆఫీసులున్నా.. పసుపు రైతుకు రూ.15 వేలు మద్దతు ధర ఎందుకు దక్కడం లేదన్నారు. పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానంత వరకు రైతుకు మేలు జరగదని ఈ కార్యాలయాల చరిత్ర చెబుతోందన్నారు. దశాబ్దాలుగా రైతులు కోరుతున్నది పసుపుబోర్డు మాత్రమేనని గుర్తు చేశారు. వారి డిమాండ్‌ మేరకు కేంద్రం పసుపుబోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా మద్దతు ధర రూ.15వేలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 


కేంద్రమే పసుపును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ఈ డిమాండ్లకు స్పందించి ఎన్నికల్లో అర్వింద్‌ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌ రాసిచ్చారని గుర్తు చేశారు. చివరకు ఏడాది కావస్తుండగా.. ఎంపీ అర్వింద్‌ తెచ్చింది స్పైస్‌బోర్డు ఆఫీస్‌ మాత్రమేనన్నారు. స్పైస్‌బోర్డు ఆఫీసులతో పసుపు రైతుకు మద్దతు ధర రాదని, ఏ ప్రయోజనాలు ఒనగూరవన్నారు. పసుపుబోర్డు తెస్తానని హామీలిచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత స్పైస్‌బోర్డు ఆఫీస్‌ పేరిట జరుగుతున్న నాటకం ఇది అన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా, టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కేంద్రం పసుపుబోర్డు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నారన్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారన్నారు. ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ భూములకు సాగునీటిని ఇస్తున్నారన్నారు. 


ఇక రైతులకు కావాల్సింది పసుపుబోర్డు మాత్రమేనన్నారు. ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సింది కేంద్రమే కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే పసుపుబోర్డును ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ పని చేయాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. పసుపుబోర్డు ఇవ్వాల్సిన కేంద్రం రోజుకో రకంగా మాటమారుస్తూ తప్పించుకుంటే కుదరదని అన్నారు. రైతులు వాస్తవాలు గ్రహించిన రోజు శంకరగిరిమాన్యాలు పడతారన్నారు. పసుపునకు మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇవ్వడం లేదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలకు వాణిజ్య పంటలతో సహా మద్దతు ధర ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వలేక కుంటిసాకులు చెబుతుందని విమర్శించారు. పసుపు రైతులు భారతదేశంలో లేరా? తమ రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రి ప్రశ్నించారు. 


logo