గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 05, 2020 , 02:14:16

అటవీ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు

అటవీ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : అటవీ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్‌ గ్రామానికి చెందిన 84 మంది రైతులకు 43/1 సర్వే నంబర్‌లోని 107 ఎకరాల 35 గుంటల భూమి పట్టాదారు పాసుబుక్కుల పత్రాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. అటవీ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల ఆధీనంలో ఉన్న భూములకు పట్టాలను రైతులకు అందజేస్తున్నామన్నారు. పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రైతుల భూముల సమస్య పరిష్కారానికి కృషిచేసిన ఆర్డీవో రాజేశ్వర్‌, సహకరించిన కలెక్టర్‌ను అభినందించారు. రాంపూర్‌ శివారులోని మరో 200 ఎకరాల ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను రైతులకు త్వరలోనే అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌, ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ, సొసైటీ అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ హరిసింగ్‌, సర్పంచులు శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీను, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌ పాల్గొన్నారు.


పేదోళ్లే మా కులం.. గరిబోళ్లే మా మతం..

పేదోళ్లే మా కులం, గరిబోళ్లే మా మతం అని.. పేదలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని 14 వార్డులో ఎలక్ట్రిక్‌ వాహనంలో మంగళవారం పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిస్రీ గల్లీలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో మాట్లాడారు. బాన్సువాడ పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక సానాల్లో గెలిపించారన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు చేపట్టాల్సిన బాధ్యతలను వివరించారు. అన్ని కాలనీల్లో తాగునీరు, విద్యుత్తు స్తంభాలు, విద్యుత్తు దీపాలు, నల్లా కలెక్షన్లు, మురుగుకాలువలు, రోడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మిస్రీ గల్లీలో నల్లా కలెక్షన్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. 


ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మిస్రీ యూత్‌ సభ్యులు కాలనీని శుభ్రంగా ఉంచుతామని 30 మంది యువకులు ముందుకు రావడంతో స్పీకర్‌ పోచారం వారిని అభినందించారు. అనంతరం కాలనీవాసులు స్పీకర్‌ పోచారాన్ని సన్మానించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నార్ల సురేశ్‌ గుప్తా, గురు వినయ్‌ కుమార్‌, మహ్మద్‌ ఎజాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, పిట్ల శ్రీధర్‌, గంగిశెట్టి నాగభూషణం, ముఖీద్‌, జడ్పీ కోఆప్షన్‌ మాజీ సభ్యుడు అలీమొద్దీన్‌ బాబా, వాహబ్‌ అలీ పాల్గొన్నారు. 


logo