బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 05, 2020 , 01:50:02

ఇక్కడ చదవడంతోనే కలెక్టర్‌ అయ్యాను

ఇక్కడ చదవడంతోనే కలెక్టర్‌ అయ్యాను

విద్యానగర్‌ : కామారెడ్డి పట్టణంలో చదవడంతోనే కలెక్టర్‌ అయ్యానని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కలెక్టర్‌ బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కృతజ్ఞతాభినందన సభను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సతీమణి గంగాభవాని, కుమారులతో పాల్గొన్నారు. ఎన్‌సీసీ విద్యార్థులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో ఉన్న రాశివనాన్ని సందర్శించారు. కలెక్టర్‌ అప్పట్లో నాటిన మొక్కకు నీళ్లు పోశారు. కళాశాలలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బదిలీపై వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నా.. ఇక్కడే చదువుకొని, కలెక్టర్‌గా పనిచేసి, ఇక్కడి నుంచి వెళ్లాలంటే బాధగా ఉందని అన్నారు. కామారెడ్డిలో కలెక్టర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 


అనంతరం సమన్య హోటల్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సమావేశంలో జేసీ యాదిరెడ్డి మాట్లాడారు. కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచారన్నారు. ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్‌, నేను ఒకేసారి కామారెడ్డికి వచ్చామని, కలెక్టర్‌ నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్‌ను జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, జిల్లా జడ్జి సత్తయ్య, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, అడిషనల్‌ ఎస్పీ అనన్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌, ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ తిర్మల్‌రెడ్డి, అధ్యాపకులు శంకర్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సంపత్‌ గౌడ్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దయానంద్‌, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo