శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 05, 2020 , 01:16:02

నెలాఖరులోగా పనులన్నీ పూర్తి కావాలి

నెలాఖరులోగా పనులన్నీ పూర్తి కావాలి

ఖమ్మం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 4: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో రూ.1.85 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. నగరంలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ విస్తృతంగా పర్యటించారు. మంజూరైన సీసీ రోడ్లు, సైడ్‌ కాలువల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. వివిధ డివిజన్లలో తిరిగి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నగర పరిధిలోని డివిజన్‌లను సందర్శించి ప్రజల అవసరాలకు అనుగుణంగా గుర్తించిన పనులను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే నగరాభివృద్ధికి రూ.250 కోట్లతో పలు అభివృద్ది పనులను చేపడుతున్నామని వివరించారు. నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను, గుత్తేదారులను మంత్రి ఆదేశించారు. ఖమ్మం నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రహదారుల విస్తరణ, డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్‌ లైటింగ్‌ ప్రధాన కూడళ్ళలో జంక్షన్లను ఏర్పాటు వంటివి చేయడంతో ఖమ్మం నగరం రోల్‌మోడల్‌గా రూపుదిద్దుకుందని అన్నారు. 


ఇప్పటికే అన్ని ప్రధాన రహదారులు విస్తరించడం జరిగిందని, డివైడర్లతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రోడ్లు విస్తరించాల్సి ఉందన్నారు. అంతర్గత రోడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి నిధుల కొరత లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ల సహకారంతో ఖమ్మం నగరం హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గత ఖమ్మాన్ని, ఇప్పటి ఖమ్మాన్ని పోల్చీచూస్తే 200 రెట్లు అభివృద్ధి చెందినట్లు కన్పిస్తున్నది అన్నారు. తాగునీటి సమస్యను కూడా అధిగమించామన్నారు. ఈ నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.కోట్లతో మిషన్‌ భగీరథ పనులు పూర్తవుతున్నాయని, ఇంటింటికీ తాగునీరును అందిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల వెంట ఉండి సకాలంలో పనులు పూర్తి చేయించాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఖమ్మం నగర ప్రజలకు ఎలాంటి సమస్యలూ ఉండకూడదనేదే టీఆర్‌ఎస్‌ ప్రధాన ఉద్దేశమని అన్నారు. 


డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు..

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి నగరంలో మంగళవారం వివిధ డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వాటిలో ఖమ్మం నగరంలోని 26వ డివిజన్‌లో రూ.30 లక్షలు, 34 వ డివిజన్‌లో రూ.35 లక్షల, 33వ డివిజన్‌లో రూ.20 లక్షలు, 20వ డివిజన్‌లో రూ.10 లక్షలు, 39వ డివిజన్‌లో రూ.10 లక్షలు, 38వ డివిజన్‌లో రూ.40 లక్షలు, 37వ డివిజన్‌లో రూ.30 లక్షలు, 48వ డివిజన్‌లో రూ.10 లక్షలతో నిర్మించబోయే అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాజీ ఆర్‌జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, దోరేపల్లి శ్వేత, శీలంశెట్టి రమా, దాదే ధనలక్ష్మి, పాలడుగు పాపారావు, రుడావత్‌ రమాదేవి, తోట రామారావు, బాలగంగాధర్‌ తిలక్‌, మున్సిపల్‌ ఎంఈ, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


logo