మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 05, 2020 , 01:15:43

ప్రతి సొసైటీకీ ప్రత్యేక ఎన్నికల అధికారి

ప్రతి సొసైటీకీ ప్రత్యేక ఎన్నికల అధికారి

ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 4: ఎన్నికల జరుగనున్న ప్రతి సొసైటీకి ఒక ప్రత్యేక అధికారిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ కర్ణన్‌ నియమించారు. గెజిటెడ్‌ హోదా కలిగిన 70 మంది అధికారులతోపాటు మరో 20 మందిని రిజర్వుగా ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన ఎన్నికల అధికారులకు మంగళవారం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా సహకార ఎన్నికల అధికారి (డీసీవో) బీఎల్‌ఎన్‌ శాస్త్ర, జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నోటిఫికేషన్‌ విడుదల నుంచి మొదలుకొని సొసైటీ చైర్మన్‌ ఎన్నిక వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణతోపాటు 9న నామినేషన్‌ల పరిశీలన చేయాల్సి ఉంటుందని డీసీవో తెలిపారు. అనంతరం 10న ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకూ తావు తేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. 


9న పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

15న జరగబోయే సహకార ఎన్నికల పోలింగ్‌ అధికారులకు, సహాయ అధికారులకు, సిబ్బందికి ఈ నెల 9న ఒక్క రోజు శిక్షణ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఒక్కో పోలింగ్‌ బూత్‌కు ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. వీరితో పాటు రిజర్వు కింద మరికొందరిని సైతం ఉంచారు. ఈ నెల 9న ఖమ్మం, మధిర, సత్తుపల్లి పట్టణాల్లో డివిజన్ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. సత్తుపల్లిలో జరిగే శిక్షణలో జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం, మధిరలో సహకార అధికారి వెంకటేశ్వర్లు, ఖమ్మంలో డీసీవో శాస్త్రి శిక్షణ శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా సొసైటీలు కలిగిన గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం ఆయా సొసైటీలను సందర్శించిన అధికారులు పోలింగ్‌బూత్‌లు, మౌలిక వసతులు, తాగునీటి వసతి తదితర అంశాలపై ఆరా తీశారు. 


అభ్యర్థులకు ప్రత్యేక గుర్తులు

అభ్యర్థుల కోసం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రత్యేక గుర్తులను ఇప్పటికే ఖరారు చేసింది. 24 గుర్తులతో కూడిన పేజీని విడుదల చేసింది. అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో పోటీలో ఉన్న సందర్భంలో మరిన్ని గర్తుల అవసరం ఉంటాయనే ఉద్దేశంతో మరో 54 గుర్తులను సిద్ధంగా ఉంచారు. ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే తెలుగు అక్షరాల ప్రకారం బీరువా, బ్యాట్‌ గుర్తులను కేటాయిస్తారు. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో బ్యాటీరీ లైట్‌, బ్రష్‌, మంచం, కప్పుసాసర్‌, డిజిల్‌ పంపు, గౌన్‌ వంటి గుర్తులను కేటాయిస్తారు. 


logo
>>>>>>