సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 04, 2020 , 00:24:54

సెలవిక..

 సెలవిక..

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ/ఇందూరు : తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు, న్యాయవాది, అభ్యుదయవాది, రైతు బాంధవుడు, మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) శివారులోని కృషిదర్శన్‌ కేంద్రం వ్యవసాయక్షేత్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు నారాయణరెడ్డి పార్థ్థీవ దేహాన్ని నిజామాబాద్‌ నగరంలోని ఆయన నివాసం నుంచి స్వర్గ రథయాత్ర వాహనంపై ర్యాలీగా 11.33 గంటలకు కృషి దర్శన్‌ కేంద్రానికి తీసుకువచ్చారు. 15 నిమిషాల పాటు పార్థీవదేహాన్ని కృషిదర్శన్‌ కేంద్రంలోని భవనంలో కుటుంబ సభ్యుల సందర్శన కోసం ఉంచారు. స్పీకర్‌ పోచా రం శ్రీనివాసరెడ్డి,  మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్త్తికేయ, ఎమ్మెల్సీలు వీజీగౌడ్‌, జీవన్‌రెడ్డి,  అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా,  మేయర్‌ నీతూ కిరణ్‌, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సమరసింహారెడ్డి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ తదితరులు నారాయణరెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసులు గార్డ్‌ ఆప్‌ హానర్‌ స్వీకరిస్తూ గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. 12.45 గంటలకు దహన సంస్కారాల ప్రక్రియ ముగిసింది. నారాయణరెడ్డి చితికి ఆయన కుమారుడు అరుణ్‌రెడ్డి నిప్పు అంటించారు. కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు, అభిమానుల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు 20 నిమిషాల ముందుగానే మంత్రులు, స్పీకర్‌, ఎమ్మెల్సీలు కృషిదర్శన్‌ కేంద్రానికి చేరుకున్నారు. నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పరామర్శించి ఓదార్చారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎంపీ, స్వాతంత్య్ర సమరయోధుడు నారాయణరెడ్డి మృతి జిల్లాకే కాకుండా రాష్ర్టానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుదలతో, ధైర్యంగా ఆనాడే గళం విప్పిన గొప్ప నాయకుడన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన గొప్ప వ్యక్తి నారాయణరెడ్డి అన్నారు.  అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు స్పీకర్‌ తెలిపారు. అనంతరం మాజీ మంత్రి కందూరి జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి పార్లమెంట్‌లో మాట్లాడిన తొలితరం నాయకుడు నారాయణరెడ్డి అని, అలాంటి నాయకుడు మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దహన సంస్కారాలకు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌రావు, తాహెర్‌ బిన్‌ హందన్‌, నరాల రత్నాకర్‌, గడుగు గంగాదర్‌, డాక్టర్లు రవీందర్‌రెడ్డి, బాపురెడ్డి, డీఎల్‌ఎన్‌ స్వామి, కోటపాటి నర్సింహనాయుడు, నగేశ్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, ఠక్కర్‌ హన్మంత్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవో వెంకటయ్య, ఏసీపీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీవో మర్రి సురేందర్‌, పోలీసు  లు, సిబ్బంది  పాల్గొని నివాళులర్పించారు. 

 తరలివచ్చిన విద్యార్థినులు..

నిజామాబాద్‌ నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు మాజీ ఎంపీ నారాయణరెడ్డి అంత్యక్రియలకు తరలివచ్చారు. చదువుతోనే మహిళలకు సాధికారత లభిస్తుందని భావించిన నారాయణరెడ్డి.. నిజామాబాద్‌ నగరంలో 1965లో తొలి మహిళా డిగ్రీ కళాశాల, పాఠశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కళాశాల విద్యార్థినులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కడసారి చూపు కోసం విద్యార్థినులు తరలివచ్చి పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.


logo