బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 04, 2020 , 00:24:10

రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బాన్సువాడ బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడావార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణను పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక వైద్యం, పేదరిక నిర్మూలన, విద్య, ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు కేవలం 8 నుంచి 9 వేల కోట్ల రూపాయల నిధులు బడ్డెట్‌ లో ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ సర్కార్‌ 18 వేల నుంచి 20 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నదని అన్నారు. వివిధ రాష్ర్టాల అధికారులు, నాయకులు మన రాష్ట్రంలో విద్యకు కేటాయిస్తున్న నిధులు, గురుకులాల పనితీరుపై అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ఇంటర్‌ విద్యార్థులు లక్ష్యం ఎంచుకొని అందుకు అనుగుణంగా కష్టపడాలని సూచించారు. కుటుంబానికి భారం కాకుండా పోషకులుగా మారాలన్నారు. అనంతరం గత ఏడాది మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన బహుమతుల ప్రదానం చేశారు.

అలరించిన నృత్యాలు.. 

బాన్సువాడ ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన క్రీడా వార్షికోత్సవం ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తి గీతాలు, తెలంగాణ పాటలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కళాశాలకు చెందిన ఉస్మాన్‌ అనే విద్యార్థి తన కుటుంబ పరిస్థితులను వివరిస్తూ చెప్పిన కవిత విని స్పీకర్‌ పోచారం అభినందించారు. ఎంపీపీ దొడ్ల నీరజ, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ జయకుమారి, విశాల, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అంజిరెడ్డి, విండో అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నార్ల సురేశ్‌ గుప్తా, కళాశాల కమిటీ సభ్యులు మహ్మద్‌ ఎజాస్‌, ముదిరెడ్డి విఠల్‌ రెడ్డి, దాసరి శ్రీనివాస్‌, అమెర్‌ చావూస్‌, దయానంద్‌, కిరణ్‌ కుమార్‌, కౌన్సిలర్‌ బాడి శ్రీనివాస్‌,  రమాదేవి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పాత బాలక్రిష్ణ, హకీం, గౌస్‌, కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్‌, చంద్రాగౌడ్‌, అజ్మిత ఉన్నీసా, తదితరులు పాల్గొన్నారు.


logo