సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 03, 2020 , 01:37:27

‘సాగర్‌'లో సిరుల సాగు

‘సాగర్‌'లో సిరుల సాగు
  • ప్రాజెక్టు శిఖం భూముల్లో ఆరుతడి పంటలు
  • శివారు ప్రాంతాల రైతులకు కల్పతరువు..

నిజాంసాగర్‌ రూరల్‌: వరుణుడు కరుణించకపోవడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీరు వెలవెలబోతున్నది. దీంతో రైతులు సాగర్‌ శిఖం భూముల్లో శనగ పంట వేశారు. ప్రస్తుతం పంటలు ఏపుగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటితో నిండి ఉన్నప్పుడు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని 2.35 లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీరు లేక ఎండిపోయినప్పటికీ కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలకు కల్పతరువుగా మారుతున్నది. వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు నిజాంసాగర్‌ ప్రాజెక్టు శిఖం (బ్యాక్‌ వాటర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా) భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని రాంరెడ్డిపేట, కల్హేర్‌, శంకరంపేట, నిజాంపేట, మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట, టేక్మాల్‌ మండలాల్లోని రైతులు ప్రాజెక్టులో శనగ పంటలను పండిస్తున్నారు. ప్రాజెక్టు శిఖం దాదాపు 20వేల ఎకరాలు ఉం డగా మూడు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు తగ్గిపోయింది. ఇది గమనించిన రైతులు అక్టోబర్‌లో ఆరుతడి పంటలు వేసుకున్నారు.  పది వేల ఎకరాల్లో శనగ, దోసతో పాటు ఇతర ఆరుతడి పంటలు వేశారు. 


జత కట్టి.. ఉమ్మడిగా సాగు

ఒక్కో గ్రామ రైతులు పది నుంచి 50 మంది రైతులు జతకట్టి పది నుంచి 50 ఎకరాల వరకు శనగ పంటను సాగు చేస్తున్నారు. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ భూములను ఆనుకొని ఉన్న గ్రామాల రైతులు పంటలను ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడిగా వ్యవసాయ పనులు చేస్తూ వంతుల వారీగా కాపలా కాస్తూ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మరో నెల రోజుల్లో పంట చేతికి అందుతుందని రైతులు తెలుపుతున్నారు. 


logo