మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 02, 2020 , 02:24:05

కోతలు వాతలు..

కోతలు వాతలు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-2021 వార్షిక ఆర్థిక బడ్జెట్ స్వరూపం తీవ్రమైన ఆర్థిక మందగమనంలో ఉన్న దేశ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇప్పటికే అన్ని రంగాల్లో ఆశించిన వృద్ధిని అందుకోలేక చతికిల పడుతున్న వేళ.. విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాల అంచనాలకు అందుకోలేకపోవడంతో వారంతా కేంద్ర సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఆదాయ పన్నుల్లో స్లాబులను ఏడు భాగాలుగా వర్గీకరించడంతో పాటుగా 70 రకాల మినహాయింపులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా మారింది. రైల్వే బడ్జెట్ విషయానికి వస్తే దక్షిణాదిపై ఢిల్లీ పెద్దల నిర్లక్ష్యం, వివక్ష మరోమారు కొనసాగింది. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలు, రైల్వే అభివృద్ధి ఏవీ ప్రస్తావించకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు మొండి చేయి చూపించారు. ఉమ్మడి జిల్లా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసిన పసుపు బోర్డు ఊసే లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆశావాహ్ భారత్... ఇదీ కేంద్ర ప్రభుత్వం 2020-2021 వార్షిక బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్దేశించుకున్న ఇతివృత్తం. ఆశావాహ్ భారత్ ద్వారా మెరుగైన జీవితాన్ని ఇవ్వడం అనేది ఇందులోని మర్మం. మాటలెలా ఉన్నప్పటికీ శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపుల తీరు చూస్తుంటే నిరాశావాహ్ భారత్ అన్నట్లుగా మారుతోంది. ప్రభుత్వ పన్ను విధానంలో పాత, కొత్త అనే రెండు రకాల స్లాబులతో వేతన జీవులంతా ఆగమాగం అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అత్యంత తెలివిగా పన్నుల విధానంలో సరళీకరణ పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు సిద్ధమైనట్లుగా అర్థం అవుతోంది. ఆదాయపు పన్ను చెల్లింపునకు రెండు విధానాలను ఈ బడ్జెట్‌లో కేంద్రం తీసుకు రావడంపై సగటు టాక్స్ పేయర్లు మండిపడుతున్నారు. పాత విధానమా? కొత్త విధానమా? అనే దానికి పన్ను చెల్లింపుదారులే ఆలోచించుకోవాలని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండకపోవడం, పాత విధానంలో మినహాయింపులు కొనసాగడం విడ్డూరంగా మారింది. నూతన పన్ను విధానం సులువుగా ఉంటుందని విత్త మంత్రి చెబుతున్నా...ఇన్‌కామ్ టాక్స్ చట్టంలోని 100 మినహాయింపుల్లో 70 తొలగించామని పేర్కొనడం ఆందోళనకు గురిచేస్తున్నది. అస్పష్టమైన ఆదాయ పన్ను స్లాబులతో ఏ విధానంలో తక్కువ పన్ను పడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన వార్షిక బడ్జెట్‌లో ఆదాయ శ్లాబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్య, ఎగువ తరగతికి ఊరటనిచ్చేలా చర్యలున్నప్పటికీ అదే సమయంలో మినహాయింపులను తీసెయ్యడం పన్ను చెల్లింపుదారుల్లో అసంతృప్తికి కారణంగా నిలుస్తోంది. పాత విధానంలో ఆదాయపన్ను శ్లాబులు మూడు ఉండగా ప్రస్తుతం కొత్త విధానంలో ఏడు శ్లాబులుగా మార్చారు. 0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను లేదు.. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు 10 శాతం, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15శాతం ఆదాయ పన్ను విధించనున్నారు. రూ.10లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు 20శాతం, రూ.12.50 లక్షల నుంచి రూ.15లక్షల వరకు 25 శాతం, రూ.15లక్షలకు పైనా ఆదాయం ఉన్న వారికి 30శాతం ఆదాయపన్ను వర్తించనుంది. ఈ కొత్త విధానాన్ని ఎంచుకునే వారికి ఆదాయ పన్ను చట్టంలోని 80సీ, 80డీ వంటివి, ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ లాంటి మినహాయింపులు వర్తించవు. ఈ విధానంలో వంద రకాల్లో 70 మినహాయింపులను తొలగించినట్లు బడ్జెట్ లో కేంద్రం పేర్కొంది.


logo
>>>>>>