బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 02, 2020 , 02:21:11

పాలన మరింత చేరువ..

పాలన మరింత చేరువ..

రాష్ట్ర ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో రూ.కోటితో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభతో కలిసి శనివారం ప్రారంభించారు. నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల ఏర్పాటుతో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. కార్యాలయాల్లో అధికారులతో సమీక్షలు నిర్వహించడంతోపాటు ప్రజల సమస్యలను తెలుసుకునే వీలుంటుందని తెలిపారు. యాసంగి పంటలు గట్టెక్కించేందుకు నిజాంసాగర్ నీటిని రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పారు. అంతకు ముందు ఆయన సతీసమేతంగా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్నారు.

- బాన్సువాడ రూరల్ విలేకరి

బాన్సువాడ రూరల్ : ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. కార్యాలయ  గదులు, ప్రాంగణాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో శాసన సభ్యులకు ప్రత్యేక క్యాంపు కార్యాలయాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి భవనాలను నిర్మించిందని అన్నారు. అధికారిక కార్యాలయాలు నిర్మించడం ద్వారా శాసనసభ్యులు అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉండడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి ఉపయోగపడుతాయన్నారు. ఎమ్మెల్యేలు నియోజవకర్గకేంద్రంలో లేనప్పుడు వ్యక్తిగత సహాయకులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. రథసప్తమి కావడంతో ఉదయం 5 గంటలకు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో స్పీకర్ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవార్, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,  ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో యావర్ హుస్సేన్ సూఫీ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, కౌన్సిలర్లు రమాదేవి, బాడీ శ్రీనివాస్, లింగమేశ్వర్, రవీందర్, నంద కిశోర్, మోహన్ నాయక్, ఎర్వాల కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్, గోపాల్‌రెడ్డి, సంగ్రాంనాయక్ వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo