సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 01, 2020 , 01:30:44

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌ ప్రక్రియ

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌ ప్రక్రియ
  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో500 మంది ఉద్యోగుల్లో సగం మందికి అర్హత
  • ప్రైవేటు సంస్థలకు కేంద్రం కొమ్ముకాస్తున్నదని ప్రజల మండిపాటు
  • కేంద్ర ప్రభుత్వ చర్యలతో కుదేలవ్వనున్న బీఎస్‌ఎన్‌ఎల్‌
  • 265 మందికి స్వచ్ఛంద పదవీ విరమణకు ఆదేశాలు జారీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న  ప్రభు త్వ రంగ సంస్థల మనుగడను ఆరేళ్ల క్రితం కేం ద్రంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పా ర్టీ ప్రశ్నార్తకం చేస్తున్నది. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ముఖ్యమైన సేవలను ప్రైవేటు పరం చేస్తూ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది. నష్టాల పేరుతో మూసేసి జనానికి ఇబ్బందులు సృష్టిస్తున్నది. కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యతను మెల్లిగా తగ్గించేసి ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చుతున్నారు. 


దేశంలో జాతీయ బ్యాంకుల విలీనం పేరుతో బ్యాంకింగ్‌ రంగాన్ని మోడీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రజా, సరకు రవాణాను తీరని భారంగా మార్చబోతోంది. నిన్న కాక మొన్న ఎయిర్‌ ఎండియా అమ్మకానికి పెట్టి విమానయానాన్ని ప్రభుత్వం చేజేతుల వదులుకుంటున్నది. తాజాగా భారత్‌ సంచార నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేసి టెలికాం రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం దూరమై ప్రైవేటు చేతికి పెత్తనం అప్పగించేందుకు సిద్ధం అవుతున్నది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో నష్టాల నివారణ పేరుతో తీసుకు వచ్చిన వీఆర్‌ఎస్‌ పథకం జనవరి 31తో అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం ఉద్యోగుల్లో సగం మందికి పదవీ విరమణ లభించింది.


50ఏళ్లు దాటితే వీఆర్‌ఎస్‌...

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)లో వీఆర్‌ఎస్‌ పథకం అమలు చేయడంతో ఉద్యోగులంతా తమ సంస్థను బాధాతాప్త హృదయంతో వదిలిపెట్టి ఇంటిదారి పట్టారు. 50 ఏళ్లు దాటిన వారు ఉద్యోగ విరమణ తీసుకుంటే పూర్తి కాలం వేతనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించడంతో అర్హత ఉన్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారుగా 480 నుంచి 500 మంది ఉద్యోగులుండగా ఇందులో సగానికి ఎక్కువ మంది వీఆర్‌ఎస్‌కు ఐప్లె చేశారు. వీరందరికీ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆదేశాలు జారీ కావడంతో వారంతా ఉద్యోగాలను వీడారు. చాలా మందికి వీఆర్‌ఎస్‌ ఇష్టం లేకపోయినప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం బలవంతంగా అర్హత ఉన్న ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. దీంతో చాలా మంది వలంటరీ రిటైర్మెంట్‌ స్కీంకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమర్పించిన వారందరికీ ఉద్యోగ విరమణకు ఆదేశాలు వెలువడడంతో ఉమ్మడి జిల్లాలో సగానికి ఎక్కువ మంది సిబ్బంది ఖాళీ అయ్యారు. యాభై ఏళ్లలోపు ఉన్న వారంతా తమ సర్వీసుల్లో కొనసాగనున్నారు. 


265 మందికి వీఆర్‌ఎస్‌...

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ఉద్యోగులకు కల్పించిన వీఆర్‌ఎస్‌ పథకంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 265 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఇందులో కామారెడ్డి జిల్లాలో 91 మంది ఉద్యోగుల్లో 71 మందికి వీఆర్‌ఎస్‌ వర్తించింది. మిగిలిన 20 మంది తమ విభాగాల్లోనే పని చేయనున్నారు. వీఆర్‌ఎస్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇంటిముఖం పట్టిన వారి స్థానాల్లో తాత్కాలిక సేవలకు అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తున్నది. తద్వారా వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే ప్రకటించింది. అవకాశం ఉన్న విభాగాలకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని తీసుకోబోతున్నట్లు గా ఉన్నతాధికారులు వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో యథావిధిగా బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలి కాం సేవలు కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ప్రీపెయిడ్‌, పోస్టు పెయిడ్‌, ఇంటర్నెట్‌ సేవల్లో అంతరాయం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.


logo